ఇఫా (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇండియన్ పర్మనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 పురస్కారాన్ని చిరంజీవికి ప్రకటించారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో 150 చిత్రాల్లో నటించినందుకు గానూ.. ఈ పురస్కారం ఆయనకు దక్కింది. తన రాకతో తెలుగు చలన చిత్రసీమలోనే కాదు.. భారతీయ చలన చిత్ర రంగంలోనూ పెను మార్పుని తీసుకొచ్చారు చిరంజీవి. ఓ సినిమా వసూళ్ల స్థాయి ఎలా ఉంటుందో ఏనాడో రుచి చూపించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా అగ్రగామీగా ఉన్నారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. తన ఇంటి నుంచి ఎంతోమంది హీరోల్ని చిత్రసీమకు అందించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని చిరుకి ఈ పురస్కారం ప్రకటించింది ఇఫా. ఈరోజు నుంచి..గోవాలో ఫిల్మ్ఫెస్టివల్స్ మొదలయ్యాయి. ఈనెల 28 వరకూ సాగే చిత్రోత్సవాల్లో… దేశంలోని వివిధ భాషల నుంచి వచ్చిన సుకుమారు 80 చిత్రాల్ని ప్రదర్శిస్తారు. ఇండియన్ పనోరమా విభాగంలో తెలుగు నుంచి అఖండ, సినిమా బండి ప్రదర్శనలో ఉన్నాయి. వీటితో పాటుగా ఆర్.ఆర్.ఆర్, మేజర్ చిత్రాల్ని సైతం ప్రదర్శించనున్నారు.