తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీలో న్యాయనిపుణులతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమె చుట్టూ తప్పించుకోలేని విధంగా ఈడీ ఉచ్చు పన్నిందని విచారణకు అంటూ పిలిస్తే అరెస్ట్ తప్పదన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. అందుకే విచారణకు పిలిస్తే ఏం చేాయలన్నదానిపై ఢిల్లీలో న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే ఆమెకు నోటీసులు అందాయన్న ప్రచారం జరుగుతోంది. అలాగే.. తెలంగాణ జాగృతికి విదేశాల నుంచిపెద్ద ఎత్తున నిధులు వచ్చాయని వాటి వివరాలు చెప్పాలని.. జాగృతి వ్యవహారాలు చూసుకుంటున్న బాసిత్ అనే వ్యక్తికీ నోటీసులు పంపినట్లుగా చెబుతున్నారు.
నిరంజన్ రెడ్డి నేతృత్వంలో కవితకు లాయర్ల బృందం సలహాలు !
కవితకు సాయం చేస్తున్న లాయర్ల బృందానికి నిరంజన్ రెడ్డి లీడర్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈయన జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను డీల్ చేస్తున్న లాయర్. కేసుల తీవ్రతను బట్టి సుప్రీంకోర్టుల్లో అత్యంత ఖరీదైన లాయర్లను కూడా ఎంగేజ్ చేస్తూంటారు. అందుకే సీఎం జగన్ ఆయనకు ఇటీవల రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయన సేవలను కవిత కూడా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
కేసీఆర్ తీరుతో బీజేపీ మరింత పట్టుదలకు పోతున్న సూచనలు
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో .. కేసీఆర్ తీరుతో బీజేపీ మరింత పట్టుదలకు పోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో .. పంతానికి పోయి.. బీఎల్ సంతోష్ వంటి కీలక బీజేపీ వ్యక్తులకు నోటీసులు ఇవ్వడం..ఆ పార్టీని మరింత రెచ్చగొట్టడమే అవుతుందని చెబుతున్నారు. ప్రాథమిక ఆధారాలుకూడా సంతోష్ మీద లేవని చెబుతున్నారు. అయినప్పటికీ నోటీసులు ఇస్తే.. పూర్తి స్థాయి ఆధారాలున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీజేపీ ఇంకెంత దూకుడుగా ఉండాలని ప్రశ్నిస్తున్నారు.
కవిత వ్యాపారాలు, ఇతర విషయాలపై గోప్యమైన సమాచారం లీక్
కవితకు సంబంధించిన అనేక వ్యాపార వ్యవహారాలు, మిత్రులతో విందులు ఇతర సమాచారాన్ని అనధికారికంగా ఢిల్లీ నుంచి లీక్ అవుతోంది. దుబాయ్‌కు చెందిన ఇఫ్తికార్ అనేపెద్ద మనిషి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వైఎస్ హయాం నుంచి అధికారంలో ఉన్న నేతలతో సన్నిహితంగా ఉండే ఇఫ్తికార్…పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయనతో లావాదేవీలను కవిత జరిపినట్లుగా లీక్ ఇచ్చారు. ఫోటోలు కూడా విడుదల చేశారు. ఇంకా ఇలాంటివి చాలా బయటకు వస్తాయని కూడా చెబుతున్నారు.
ప్రస్తుతానికి రెండు ప్రభుత్వాల మధ్య దర్యాప్తు సంస్థలతో దూకుడైన రాజకీయం నడుస్తోంది. ఎవరి అవినీతికి ఎవరి దగ్గర ఆధారాలుంటే.. వారే విజయం సాధిస్తారు. ఏమీ లేకుండా.. కేవలం రాజకీయంగా ఫిక్స్ చేయాలనుకుని తప్పుడు కేసులు పెట్టిన వారు ఎవరైనా ఉంటే ఇరుక్కుపోతారు. ఇవాళ కాకపోతే.. రేపైనా ఇబ్బంది పడతారు. రాజకీయాల్లో తప్పులు చేస్తే . ఆ నష్టం తీవ్రంగా ఉంటుంది.