భారత రత్న అవార్డులను కూడా బీజేపీ రాజకీయ లాభం లెక్కలు చూసుకునే ఇస్తుందనే విమర్శలు ఉన్నాయి. అలాంటిది ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’ లాంటి ప్రతీ ఏడాది ఇచ్చే అవార్డును చిరంజీవికి ఇచ్చారంటే అలాంటి లెక్క లేకుండా ఏమీ ఉండదు. నిజంగా చిరంజీవి అంత కంటే ఎక్కువ ప్రతిభావంతుడు. ఆయనకు పద్మవిభూషణ్ కూడా వచ్చింది. దాంతో పోలిస్తే ఈ ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’ పురస్కారం పెద్దదేం కాదు. అయితే వచ్చింది కాబట్టి ఫ్యాన్స్ అందరూ సంతోషించారు. కానీ ఆ తర్వాత బీజేపీ నేతలు చేస్తున్న హడావుడి మాత్రం ఏదో తేడాగా ఉన్నట్లుగా ఉందే అన్న అభిప్రాయానికి వస్తున్నారు.
చిరంజీవికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ అవార్డు అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. అభినందలు తెలిపారు. అక్కడ్నుంచి ఇతర బీజేపీ నేతలు ప్రారంభించారు. చివరికి ఏపీ బీజేపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కూడా అభినందనలు తెలిపారు. ఇక సునీల్ ధియోధర్ లాంటి వాళ్లు ఊరుకుంటారా ? వారు కూడా రంగంలోకి దిగారు. కింది స్థాయి బీజేపీ నేతల గురించి చెప్పాల్సిన పని లేదు. వారి హడావుడి చూస్తూంటే.. చిరంజీవి బీజేపీ నేత అయిపోయారా.. లేకపోతే బలవంతంగా కలిపేసుకుంటున్నారా అన్న డౌట్ ఇతరులకు రావడం ఖాయమే.
చిరంజీవిని బీజేపీ ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా చూసేందుకు ప్రయత్నిస్తోంది. భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవిని ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో మోదీ .. చిరంజీవి తనకు ఎంతో ఆప్తమిత్రుడన్నట్లుగా సంభాషించారు. తర్వాత కూడా ఈ పాజిటివ్ ఫీలింగ్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు అది ఇంకాస్త ముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. చిరంజీవి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారో రారో కానీ.. బీజేపీ మాత్రం గట్టి ప్రయత్నాలు చేస్తోందని ఎవరికైనా అనిపిస్తే.. తప్పేం లేదు.. ఎందుకంటే బీజేపీ నేతల ప్రయత్నం అదే మరి !