జనసేన పార్టీని రౌడీ సేన అన్న సీఎం జగన్ రెడ్డికి పవన్ కల్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. జనసేన.. విప్లవసేన అని స్పష్టం చేశారు. వైఎస్ వివేకాను చంపిన పార్టీ నేతలు ఉన్న పార్టీన ఏమనాలని ప్రశ్నించారు. వైసీపీ రాజకీయ పార్టీ కాదని ఉగ్రవాద సంస్థ అని పవన్ స్పష్టం చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఇప్పటం రైతులకు సాయం పంపిణీ చేసే కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటం గడపల్ని కూల్చినట్లే వైసీపీ ప్రభుత్వాన్ని కూలుస్తామన్న పవన్ !
ఇప్పటం ఇళ్ల బాధితులు వీరోచితంగా పోరాడారన్నారు. అమరావతి రైతులు ఆ విధంగా పోరాడి ఉంటే.. అమరావతి తరలించే ఆలోచనలు చేసే వారు కాదన్నారు. వైసీపీ నేతలది ఆధిపత్య అహంకారమని. .. కంఠంలో ఉన్నంత వరకూ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతానని ప్రకటించారు. ప్రధానితో ఏం మాట్లాడారన్నదానిపై సజ్జల చేసిన వ్యాఖ్యలపై పవన్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. తాను ప్రధానితో ఏం మాట్లాడితే సజ్జలకు ఎందుకని ప్రశ్నించారు. తన దగ్గరకు వస్తే చెవిలో చెబుతానని సెటైర్ వేశారు. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత పూర్తిగా సజ్జల ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు. ఇప్పటంలో గడపలు కూల్చారు.. వైసీపీ గడప కూల్చేవరకూ వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. కట్ డ్రాయర్ల ఫ్యాక్టరీకి కూడా డబ్బులు అడుగుతారా.. ఇదేం పాలన అని పవన్ మండిపడ్డారు.
వీధి రౌడీలను ఎలా ఎదుర్కోవాలో తెలుసు !
వైసీపీ నేతల దాడులకు జనసేన భయపడబోదని పవన్ కల్యణ్ స్పష్టం చేశారు. ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తానని ప్రకటించారు. జనసేనకు అండగా ఉన్న వారిని బెదిరిస్తున్నారని.. మీ తాటాకు చప్పళ్లకు బెదిరిపోమని పవన్ హెచ్చరించారు. వీధి రౌడీలను ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసన్నారు. వైసీపీ ఫ్యూడలిస్ట్ కోటలను బద్దలు కొడతామన్నారు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తనను తన కులం వారితోనే తిట్టిస్తున్నారని… తన పని కులాలను కలపడమేనన్నారు.
ప్రధానితో చెప్పి చేయను.. నా యుద్ధం నాదే !
వైసీపీని దెబ్బకొట్టాలంటేప్రధానికి చెప్పి చేయనని.. తానే కొడతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నా యుద్ధం నేనే చేస్తానన్నారు. వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లి తనపై ఫిర్యాదు చేస్తారని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఇదే సవాల్ చేస్తున్నానని.. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో మేమూ చూస్తామని హెచ్చరించారు.