ఒక్క టీజర్‌తోనే టాలీవుడ్ దృష్టినంతటినీ తనవైపుకు తిప్పుకొన్న సినిమా ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న సినిమా ఇది. టీజర్‌లోని విజువల్స్ చూసి… అంతా షాక్‌కి గురయ్యారు. కొంతమందైతే.. వందల కోట్లతో తీస్తున్న ‘ఆదిపురుష్’తో పోలిస్తే… ‘హనుమాన్’ వందరెట్లు నయం అంటూ పోలికలు కూడా తీస్తున్నారు. ప్రశాంత్ వర్మని జూనియన్ రాజమౌళి అంటూ అభివర్ణిస్తున్నారు. ఎప్పుడైతే టీజర్ సూపర్ హిట్ అయిపోయిందో, అప్పుడే ‘హనుమాన్’ సినిమాకి మంచి గిరాకీ ఏర్పడిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ గురించి గట్టి పోటీ మొదలైంది. జీ సంస్థ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కుల కోసం భారీ రేటు కోడ్ చేసినట్టు సమాచారం. ఆ రెండు రైట్స్ రూపంలోనే.. ‘హనుమాన్’ బడ్జెట్ మొత్తం తిరిగి వచ్చేస్తోందని తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చేదంతా ఇక లాభమే అనుకోవాలి. హిందీ రైట్స్ కోసం కూడా గట్టి పోటీ ఏర్పడిందని టాక్. ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ.. ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చింది. అక్కడి నుంచి కూడా మంచి మొత్తం రాబట్టే అవకాశాలున్నాయి. ‘హనుమాన్’కి దాదాపుగా రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకూ బడ్జెట్ అయ్యింది. తేజా సజ్జాని నమ్ముకొని ఇంత భారీ మొత్తం పెట్టుబడి ఎందుకు పెట్టారా? అని అప్పట్లో అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ సొమ్మంతా ఇప్పుడు నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే వచ్చేస్తున్నాయి. ఎటు చూసినా.. `హనుమాన్`కి భారీ లాభాలు రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.