ఢిల్లీలోని తమిళనాడు భవన్లో హఠాత్తుగా సీబీఐ అధికారులు రెయిడ్ చేసి… కొవ్విరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే.. ఆయనకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేయాలని.. హైదరాబాద్, విశాఖ సీబీఐ కార్యాలయాలకు సమాచారం ఇచ్చారు. ఆ సోదాలు చేసిన తర్వాత సీబీఐ ప్రకటన చేసింది. నకిలీ సీబీఐ అధికారి అయిన కొవ్విరెడ్డి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశామని ప్రకటించింది.
అయితే ఈ కొవ్విరెడ్డి శ్రీనివాస్ ఎవరు ? సీబీఐ ఆఫీసర్ పేరుతో ఎవరిని మోసం చేశారు ? ఎవరు ఫిర్యాదు చేశారు ? అన్న అంశాలపై క్లారిటీ లేదు. గుట్టుగా మొత్తం విచారణ జరిపి కీలకమైన విషయాలు ఉండటంతోనే అరెస్ట్ చేశారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కొవ్విరెడ్డి శ్రీనివాస్.. ఇటీవల ఈడీ, సీబీఐ కేసుల వ్యవహారాల్లో ప్రముఖుల్ని బయట పడేస్తానని.., వారి పేర్లు బయటకు రాకుండా చేస్తానని చెప్పి.. రూ. కోట్లతో ఒప్పందాలు చేసుకుని ఢిల్లీకి వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. ఆయన దగ్గర బంగారంతో పాటు రూ. 21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
కొవ్విరెడ్డి శ్రీనివాస్ దగ్గర ఉన్న ఫోన్,ల్యాప్ ట్యాప్లలో పూర్తి సమాచారాన్ని సేకరించారు. వాటి నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో చాలా మంది గుట్టు ఉంటుందని భావిస్తున్నారు. తమిళనాడు భవన్లో దొరికిన ఈ కొవ్విరెడ్డి శ్రీనివాస్ తమిళనాడు కు చెందిన వ్యక్తి కాదు. విశాఖకు చెందిన వ్యక్తే. అసలు ఎలా లాబీయింగ్‌కు వచ్చాడన్నది సీబీఐ అధికారులు తేల్చనున్నారు. ఇప్పటికైతే.. నకిలీ సీబీఐ అధికారి అని చెలామణి అవుతున్నారని కేసు పెట్టారు.