చిరంజీవి సాధించిన అవార్డుల జాబితాలో మరోటి చేరింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాటిలీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుని చిరంజీవికి ప్రకటించిన సంగతి తెలిసిందే. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా ఈ రోజు జరిగిన కార్యక్రమంలో చిరంజీవి ఈ అవార్డుని అందుకొన్నారు. ”ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకం. మూడు దశాబ్దాల నుంచి ఇలాంటి తరుణం కోసం ఎదురు చూస్తున్నా. ఈ అవార్డు నాకే కాదు.. నా అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింద”న్నారు చిరంజీవి. ఈ సందర్భంగా తనకు అవార్డు అందించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
”45 ఏళ్లకుపైగా చిత్రసీమలో ఉన్నా. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లా. కొంత గ్యాప్ వచ్చింది. అయితే రాజకీయాల వల్లే… చిత్రసీమ విలువేంటో నాకు మరోసారి స్పష్టంగా తెలిసొచ్చింది. ఎలాంటి అవినీతి లేని పరిశ్రమ ఏదైనా ఉందంటే.. అది చిత్రసీమ ఒక్కటే. తొమ్మిదేళ్ల తరవాత.. నా రీ ఎంట్రీ సమయంలో అభిమానులు నన్ను ఎలా రిసీవ్ చేసుకొంటారో అనుకొనేవాడ్ని. వాళ్లు నాపై ఎనలేని ప్రేమ చూపించారు. ఇక జీవితాంతం చిత్రసీమలోనే ఉంటాను. నాకు యువ హీరోలు పోటీ కాదు. నేనే వాళ్లకు పోటీ” అన్నారు చిరు.