చిరంజీవిని ఎలాగోలా ఆకట్టుకుని బీజేపీలోకి తెచ్చేందుకు ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022ను చిరంజీవికి ప్రకటించిన తర్వాత బీజేపీ నేతలంతా …ప్రధానితో సహా శుభాకాంక్షలు చెప్పారు. అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం గోవాలో ఘనంగా జరిగింది. దీనికి బీజేపీ సానుభూతిపరులైన బాలీవుడ్.. ఇతర సినీ ప్రముఖులు చాలా మంది వచ్చారు. అంత మంది మధ్య.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్లే.. రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా అని అడిగేశారు.
అనురాగ్ ఠాకూర్ ఉద్దేశం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లోకి వచ్చి హిట్ అయినట్లే..రెండో సారి రాజకీయాల్లోకి వస్తే సూపర్ హిట్ అవుతారనే ఆశ కల్పించారు. అది బీజేపీ ద్వారానే అ సంకేతాలు ఇప్పటికే చాలా రోజులుగా వస్తున్నాయి. అయితే చిరంజీవి ఏ మాత్రం టెంప్ట్ కాలేదు. తాను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రశ్నే లేదని తేల్చేశారు. తాను ఇక సినిమాలకే అంకితమని స్పష్టం చేశారు. దీంతో బీజేపీ ప్రయత్నాలన్నీ విఫలం అయినట్లుగానే అనుకోవాలి. చిరంజీవిని పాంపర్ చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టేశాయి. ప్రధాని ఎంత ఆప్యాయత చూపినా చిరంజీవి ఏ మాత్రం తగ్గకపోవడం.. ఆయన ఓ నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటారనే దానికి సాక్ష్యం అంటున్నారు.
చిరంజీవి తన సోదరుడికి మద్దతుగా మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ ఉన్నత స్థానానికి వెళ్తుందని చెబుతున్నారు. అందుకే.. ఇటీవలి కాలంలో వైసీపీ నేతలు కూడా ఆయనను దూరం పెడుతున్నారు. అయినా సరే చిరంజీవి ఏ మాత్రం తగ్గడం లేదు. ఆయన బీజేపీలోకి వస్తే ఏపీలో ఓ బలమైన ఫోర్స్‌గా మారవచ్చని బీజేపీ అనుకుంటోంది. ఆయనసోదరుడు బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ.. మిత్రపక్షాన్ని బలపర్చడం బీజేపీకి ఇష్టం ఉండదు. ఆ పార్టీని విలీనం చేయాలని కోరుతున్నా.. పవన్ నిరాకరిస్తున్నారు.