అమరావతి విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందా అని ఆసక్తిగా చూసిన వారందరికీ.. ఆ మూడు చానళ్లు గట్టి షాకిచ్చాయి. హైకోర్టు తీర్పుపై స్టే వచ్చినంతగా హడావుడి చేశాయి. హైకోర్టు తీర్పును తప్పు పట్టిందని చెప్పుకొచ్చారు. కానీ వాస్తవంగా తీర్పును చూస్తే… ప్రభుత్వానికి తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలిందని ఎవరికైనా తెలుస్తుంది. కాని హైకోర్టు తీర్పులకు కూడా వక్రభాష్యాలు చెబుతూ.. తమ యజమానులకు ఇష్టమైన పార్టీలకు చెందిన లాయర్లు చేసిన వాదనలనే వినిపిస్తూ.. చూపిస్తూ.. ప్రజల్ని ఈ చానళ్లు ఎందుకు మభ్యపెట్టాలనుకుంటున్నాయి ? నిజాలను ప్రజలకు ఎందుకు చేరవేయడంలేదు ?
సాక్షి… టీవీ9, ఎన్టీవీ తల ఎక్కడ పెట్టుకుంటాయి ?
న్యాయవ్యవస్థ, తీర్పుల గురించిరాసేటప్పుడు మీడియా జాగ్రత్తలు పాటిస్తుంది. కానీ విచిత్రం ఏమిటో కానీ తెలుగు మీడియాలో నీలి..కూలి మీడియాగా ప్రసిద్ధి పొందిన కొన్ని సంస్థలు మాత్రం … ఏ మాత్రం వెరపు లేకుండా వ్యవహరిస్తున్నాయి. తీర్పులను పట్టించుకోకుండా… తమకు అనుకూలమైన లాయర్ ఏ వాదనలు వినిపిస్తే వాటినే గట్టిగా ప్రచారం చేస్తున్నారు. కానీ తీర్పు గురించిమాత్రం సరిగ్గా చెప్పడం లేదు. అమరావతి విషయంలో సుప్రీంకోర్టులో జరిగింది ఇదే. జస్టిస్ నాగరత్న చేసిన వ్యాఖ్యలకు విశేష ప్రాధాన్యం ఇచ్చిన మీడియా… తీర్పులోని అంశాలపై మాత్రం కిక్కుమనలేదు. వాస్తవాలను ప్రజలకు చెప్పలేదు.
సుప్రీంకోర్టు నిర్ణయంతో మూడు రాజధానులపై ముందుకెళ్లలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం !
హైకోర్టు పెట్టిన గడువులపైనే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ స్టే ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు. ఇచ్చినా.. ఇవ్వకపోయినా సర్కార్కు ఇబ్బందేం లేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిన కొన్ని విషయాలు.. విధించిన కొన్ని ఆంక్షలను చూస్తే… రైతులిచ్చిన భూమిలో అంగుళం కూడా దుర్వినియోగం చేయలేరు సరి కదా.. రాజధానిని అడుగు కూడా కదిలించలేరని స్పష్టమవుతుంది. పేదలకు పంచాలని అసెంబ్లీలో చేసిన చట్టంమార్పు కూడా పనికి రాదని తేలిపోయింది. ఇవన్నీ.. నీలి..కూలి మీడియా చెప్పలేదు. ఆ పిటిషన్పై విచారణ ముగిసే వరకూ.. మూడుపై ముందుకెళ్లలేరు. విచారణ ఎంత కాలం జరుగుతుందో అంచనా వేయడం కష్టం. మెరిట్స్ ప్రకారం చూస్తే.. ఏం జరుగుతుందో న్యాయనిపుణులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు.