వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఏపీలో విచారణలో న్యాయం జరగడం లేదని.. సాక్షులను బెదిరిస్తున్నారని .. విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లేదా ఇతర రాష్ట్రాల్లో ఉండేలా చూడాలని సునీత పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నెల రోజుల కిందటే విచారణ పూర్తయి తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ తీర్పును ప్రకటించారు.
వివేకా హత్య కేసు ఫైల్స్ … వివరాలన్నింటినీ కడప సీబీఐ కోర్టు నుండి… హైదరాబాద్కు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీలో న్యాయం జరగదని వివేకా కుమార్తె భావిస్తున్ననందున.. తెలంగాణకు మారుస్తున్నామని న్యాయమూర్తి తెలిపారు. వైఎస్ వివేకా సీఎం జగన్కు సొంత బాబాయ్. అయినప్పటికీ ఆయనను హత్యచేసిన వారిని శిక్షించడానికి జగన్ చొరవ చూపకపోగా నిందితులకు అండగా ఉంటున్నారన్న అభిప్రాయం ఎక్కువగా ఉంది. సునీత కుమార్తె కూడా సుప్రీంకోర్టుకు చెప్పారు. వివేకా హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ కావడం.. జగన్ పాలనా తీరుకు మారని మచ్చ లాంటిదే.
సొంత బాబాయ్ హత్య నిందితుల్ని రక్షించడానికి ప్రయత్నాలు చేశారన్న అభిప్రాయం ఈ తీర్పు కారణంగా బలపడుతుంది. సీబీఐ కూడా ఈ కేసు విచారణలో ప్రభుత్వం వైపు నుంచి ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రస్తావించింది. సీబీఐ అధికారులు కేసులు ఎదుర్కొన్నారని.. బెదిరింపులు ఎదుర్కొన్నారని వివరించారు. ఇవన్నీ జగన్ నైతికతను ప్రశ్నార్థకం చేసేవే. ఇక నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది.
అయితే ఈ కేసులో నిందితుడైన శివశంకర్ రెడ్డి భార్య.. వివేకా అల్లుడు, కుమార్తెలే హత్య చేయించారంటూ… దాఖలు చేసిన పిటిషన్పై పులివెందుల కోర్టు మూడు రోజుల కిందట వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఆ కోర్టు సీబీఐ కోర్టు కాదు. ఆ కోర్టు.. సీబీఐకి ఏమైనా ఆదేశాలిస్తుందేమో చూడాల్సి ఉంది.