ఈ యేడాది సంచలనం సృష్టించిన చిత్రాల్లోమ ‘కశ్మీరీ ఫైల్స్’ ఒకటి. బాక్సాఫీసు దగ్గర ఈ సినిమాకు కోట్లు కుమ్మరించారు. రాజకీయంగానూ చర్చనీయాంశం అయ్యింది. ఈ చిత్రాన్ని గోవా చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. అక్కడ కూడా ‘కశ్మీరీ ఫైల్స్’ రగడ సృష్టించింది. గోవా చిత్రోత్సవాల్లో `కశ్మీరీ ఫైల్స్`ని ప్రదర్శించిన అనంతరం జ్యూరీ హెడ్, ఇజ్రాయిల్ దర్శకుడు నడవ్ లాపిడ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదో అసభ్యకరమైన చిత్రమని, కేవలం ప్రచారం కోసం తీశారని, ఇలాంటి సినిమాల్ని అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శించడం హేయమైన చర్య అని ఘాటుగా విమర్శించారు. జ్యూరీ హెడ్ అయి ఉండి.. ఆయనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై.. ‘కశ్మీరీ ఫైల్స్’లో కీలక పాత్ర పోషించిన అనుపమ్ ఖేర్ ధీటుగా స్పందించారు. ”నాడు యూదులపై జరిగిన మారణకాండ నిజమైతే.. నేడు కశ్మీర్లో జరిగిన ఊచకోత కూడా నిజమే.. ఆ మనిషికి దేవుడు కాస్త తెలివిని ప్రసాదించాలి” అంటూ వ్యంగ్య బాణాలు విసిరారు. నవడ్ లాపిడ్ వ్యాఖ్యలపై ఇజ్రాయిల్ రాయబారి వెంటనే దిద్దుబాటు చర్యలు మొదలెట్టారు. నడవ్ కామెంట్లు పూర్తిగా వ్యక్తిగతమైనవని, సరైన అవగాహన లేకుండా ఆయన మాట్లాడిన మాటల్ని పట్టించుకోవద్దని.. `కశ్మీరీ ఫైట్స్` బృందాన్ని కోరారు. ”చరిత్ర తెలియకుండా వ్యాఖ్యలు చేయడం తగదు. మీ వ్యాఖ్యల పట్ల నేను సిగ్గు పడుతున్నా. భారత ప్రభుత్వానికి నా క్షమాపణలు” అంటూ ఈ వివాదాన్ని తెర దించడానికి ప్రయత్నించారు.