తెలంగాణ రాజకీయాల్లో ఒక రోజు మొత్తం షర్మిల డామినేట్ చేశారు. అది వ్యూహాత్మకమా.. లేకపోతే రాజకీయమా.. లేకపోతే.. అలా జరిగిపోయిందా అన్నది మనం చెప్పుకోలేం కానీ.. షర్మిల ధర్నా అరెస్ట్ ఎపిసోడ్ అంతా స్క్రిప్టింగ్ ప్రకారమే జరిగిందని అనుకోవడానికి చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి.
షర్మిల ప్రగతి భవన్ వద్ద నిరసన చేయడానికి ప్లాన్ చేసుకున్నారని.. ఆమెను హౌస్ అరెస్ట్ చేసినట్లుగా ఉదయం పోలీసులు మీడియాకు చెప్పారు. లోటస్ పాండ్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. కానీ పదకొండు గంటల తర్వాత ఆమె పోలీసుల కన్నుగప్పి ప్రగతి భవన్‌కు బయలుదేరారని మీడియాకు సమాచారం వచ్చింది. అలా ఎలా సాధ్యమబ్బా అనుకునేలోపే.. అసలు డ్రామా పంజాగుట్ట దగ్గర ప్రారంభమైంది.
నర్సంపేటల దాడుల్లో ధ్వంసమైన వాహనాలను తీసుకుని షర్మిల ప్రగతి భవన్ వైపు వెళ్తూంటే పోలీసులు అడ్డుకున్నారు. కిందకు దిగేందుకు షర్మిల నిరాకరించారు. కాసేపు తోపులాటల తర్వాత క్రేన్‌ను తీసుకొచ్చి.. కారుతో సహా ఆమెను లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా ఓ అరగంట డ్రామా నడిచింది. చివరికి బలవంతంగా కారు డోర్లు తెరిచి.. పోలీస్ స్టేషన్లోకి తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు మూడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
తర్వాత లోటస్ పాండ్ నుంచి వైఎస్ విజయలక్ష్మి బయలుదేరారు. అయితే పోలీసులు ఇంటి దగ్గరే అడ్డుకున్నారు. తర్వాత ఆమె కూడా కళ్లు గప్పి వెళ్లి కుమార్తెను పరామర్శించే సన్నివేశం ఉంటుందో లేదో సాయంత్రానికి తెలుస్తుంది.
ఈ వ్యవహారంలో మొత్తం గట్టిగా యాభై మంది వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు లేనప్పటికీ.. కావాల్సినంత తోపులాటను క్రియేట్ చేయగలిగారు. మీడియా ప్రతినిధులు దృశ్యాల కోసం చిత్రీకరణ కోసం తోసుకున్నారు.
ఇలా షర్మిలనే మొత్తం మీడియా కవరేజీలో కనిపించారు. నిజానికి ఈ రోజు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర నిర్మల్ జిల్లా భైంసా నుంచి ప్రారంభించారు. కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ కాలేకపోయింది. మొత్తం షర్మిలే కనిపించారు.
దీంతో ఇదంతా టీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా చేసిన రాజకీయం అన్న అభిప్రాయం వినిపిస్తోంది.షర్మిలకు తెలుసో లేదో కానీ.. ఆమెను లోటస్ పాండ్ నుంచి బయటకు వదిలి పెట్టి.. స్ట్రీట్‌లో ధర్నా చేయడానికి అవకాశం కల్పించారని.. అక్కడ్నుంచి బండి సంజయ్ పాదయాత్రపైఎవరి దృష్టి పడకుండా చేసుకోవడంలో సక్సెస్ అయ్యారన్న అభిప్రాయం సహజంగానే వస్తోంది. కారణం ఏదైనా.. షర్మిల మాత్రం రోజంతా హైలెట్ అయ్యారు.