సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల విషయంలో.. మహేష్ బాబుపై విమర్శలు గట్టిగా వినిపించాయి. మహా ప్రస్థానంలో కృష్ణ దహన సంస్కారాలు చేయడం అభిమానులు కూడా హర్షించలేదు. అయితే నాన్న పేరుతో శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఏదైనా ఓ భారీ కార్యక్రమం చేయాలని మాత్రం మహేష్ భావిస్తున్నట్టు సమాచారం. సూపర్ స్టార్‌కు స్మారక స్థూపం కట్టాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు భావిస్తున్నాయి. మహేష్ కూడా తన వంతుగా ఓ అవార్డు అందివ్వాలని చూస్తున్నాడు. సూపర్ స్టార్ పేరుతో ఓ అవార్డు నెలకొల్పి.. ప్రతీ ఏటా చిత్రసీమకు సేవలు అందించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు ఈ పురస్కారం ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మే 31 కృష్ణ జన్మదినం. ఈ సందర్భంగా ఈ అవార్డుని ప్రదానం చేసే ఆలోచన ఉంది. ఇది వరకు ఎన్టీఆర్, ఏఎన్నార్ పేరుతో కూడా జాతీయ అవార్డులు ఇచ్చేవారు. ఎన్టీఆర్ అవార్డు ప్రభుత్వమే ఇచ్చేది. ఏఎన్నార్ ది ప్రైవేటు అవార్డు. అయితే ఏఎన్నార్ బతికున్నంత కాలం.. క్రమం తప్పకుండా అవార్డు ఇచ్చేవారు. అందుకోసం ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారు ఏఎన్నార్. అయితే కొంతకాలంగా.. ఈ అవార్డు ప్రకటించడం లేదు. ఎన్టీఆర్ అవార్డు సరే సరి. ఇక నంది, సింహా పురస్కారాల మాటే లేదు. కనీసం కృష్ణ అవార్డు అయినా క్రమం తప్పకుండా ఇస్తే బాగుంటుందేమో..?