వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు.. టీఆర్ఎస్ సర్కార్ మంచి మైలేజీ ఇచ్చింది. ఆమె పాదయాత్రను ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదు. భారీగా ఖర్చు పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారు. స్వచ్చందంగా వచ్చే ప్రజలు లేరు. ఆ విషయం టీఆర్ఎస్కూ తెలుసు. అయినా సరే.. ఆమె అసభ్యంగా మాట్లాడుతున్నారని చెప్పి నర్సంపేటలో దాడులు చేశారు. తర్వాత హైదరాబాద్లో “షో” చేయడానికి అవకాశం కల్పించారు. ఇది ఎంత అంటే… రోజంతా ఉండేలా చూసుకున్నారు. షర్మిలను రోడ్డుపై నుంచే కారుతో సహా లిఫ్ట్ చేయడం.. . విజయలక్ష్మి రోడ్డుపై ధర్నా… బ్రదర్ అనిల్ భర్త సెంటిమెంట్.. చివరికి కోర్టు.. బెయిల్.. అంతా.. ఓ రేంజ్లో ఎలివేషన్లు ఇచ్చారు.
నిజానికి ఆమెను ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసి ఉంటే.. ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగానే షర్మిలకు మైలేజీ ఇచ్చిందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. పాదయాత్రను ఆపేస్తే కోర్టు ఎలాగూ అనుమతిస్తుంది. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చేయకుండా ప్రభుత్వాలు అడ్డుకోలేవు. అయినా ఇంత చేయడానికి టీఆర్ఎస్ సర్కార్ అనుమతిచ్చి..షర్మిలకు మేలు చేసింది. రాజకీయపార్టీ పెట్టినప్పటి నుండి.. షర్మిలకు ఈ స్థాయిలో మీడియా కవరేజీ ఎప్పుడూ రాలేదు. ఇది గుడ్ స్టార్ట్ అనుకుని ఆమె పోరాటం చేసే చాన్స్ ఉంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును.. చీల్చే శక్తి ఎవరికి ఉన్నా.. వారికి ఎంతో కొంత మద్దతు ఇచ్చేలా టీఆర్ఎస్ చూసుకుంటోంది. రెండు శాతం ఓట్లు చీల్చినా.. అది చాలా తేడాకు కారణం అవుతుంది. టీఆర్ఎస్కు అది చాలా ముఖ్యం . అందుకే షర్మిలకు ఎలివేషన్లు ఇస్తున్నారని అంటున్నారు. కారణం ఏదైనా.. షర్మిలకు మాత్రం .. రాజకీయంగా ఈ మంగళవారం.. ఎంతో ప్లస్ అయిన రోజు.