టీచర్లు తమపై ఆగ్రహంగా ఉన్నారని వారిని ఎన్నికల విధుల్లో ఉంచితే … రెండు చేతులతో ఓట్లేసేస్తారని భయపడుతున్నారేమో కానీ.. హఠాత్తుగా బోధనేతర విధుల నుంచి టీచర్లకు మినహాయింపునిస్తూ…జగన్ సర్కార్ ఆర్డినెన్స్ రెడీ చేసింది. నిజానికి ప్రభుత్వంపై ఉద్యోగులందరూ ఆగ్రహంతోనే ఉన్నారు. ఉద్యోగ సంఘం నేతలు మాత్రమే కాస్త సంతోషంగా ఉన్నారు. ఆ నేతలు పనులు చేసేవాళ్లు కాదు. ఉద్యోగమే చేయరు. విధులే నిర్వహించరు. మరి మిగతా ఉద్యోగుల్ని ఏం చేస్తారు ?
టీచర్లు వ్యతిరేకంగా ఉన్నారని వారిని ఎన్నికలకు విధులకు దూరం చేస్తారు సరే.. మరి ప్రభుత్వంపై రగిలిపోతున్న ప్రజలనూ ఓట్లకు దూరం చేస్తారా ? . వాలంటీర్ల ద్వారా బెదిరించి.. ప్రభుత్వానికి ఓట్లు వేస్తారనుకున్న వారిని మాత్రమే ఓటింగ్‌కు రావాలని మిగతా వారు రాకూడదని అనధికారిక నిబంధన అమలు చేస్తారా ? ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. ఎందుకంటే పాలన ఆ స్టైల్లో ఉంది. ఓటు బ్యాంక్‌కు ఇంటికి రూ. పది వేలు చొప్పున ఇస్తున్నాం కాబట్టి తమకే ఓట్లేస్తారని తెగ అనుకుంటున్నారు.. కానీ ఆ నమ్మకం వారికే లేదు. అందుకే అన్ని రకాల తప్పుడు మార్గాలనూ అన్వేషిస్తున్నారు.
సాధారణంగా ఎన్నికల విధుల్లో టీచర్లే ఎక్కువగా ఉంటారు. ఎన్నికలు సాధారణంగా స్కూళ్లకు సెలవులు ఉన్న సమయంలో జరుగుతాయి. ఉపఎన్నికలు.. ఇతర ఎన్నికలు స్కూల్స్ నడుస్తున్న సమయంలో జరిగితే..సెలవు ఇస్తారు. సుదీర్ఘకాలంగా ఎన్నికలు అంటే తొలుత టీచర్లే గుర్తుకువచ్చేలా వారిని వినియోగించుకుంటున్నారు. ఓట్ల జాబితాల పరిశీలన నుంచి ఎన్నికల రోజు ఓటింగ్ వరకు వారే ఉంటారు. టీచర్లు లేకపోతే ఎన్నికల నిర్వహణ కష్టం అయిపోతుంది. విషయం ఏమిటంటే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే వారు ప్రభుత్వ ఉద్యోగులేనా అన్న డౌట్ వారికీ ఉంది. ప్రభుత్వం అలా ట్రీట్ చేస్తోంది మరి !