పాత సినిమాల్లో పోరాటం అంటే పద్యాలు, కవితలతో ఒకరినొకరు విమర్శించుకోవడమే. ఇప్పుడు సీన్ మారిపోయింది. రాజకీయాల్లో అయితే.. బూతులే విమర్శలుగా చెలామణి అవుతున్నాయి. అయితే.. తెలంగాణలో ఇద్దరు మహిళా నేతలు మాత్రం.. కవితలతో విమర్శలు చేసుకుని మళ్లీ పాత కాలం సినిమాలను గుర్తు చేశారు. ఈ కవితల విమర్శల రాజకీయానికి ముందుగా కల్వకుంట్ల కవితనే ప్రారంభించారు.
ఉదయం ఆమె షర్మిల, బీజేపీని కలిపి పరోక్షగా విమర్శిస్తూ.. తాము వదిలిన “బాణం” తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు” అంటూ ట్వీట్ పెట్టారు. ఇందులో నేరుగా విమర్శించలేదు. కానీ ఎవరికైనా ఇట్టే అర్థం అయిపోతుంది.. రెండు రోజులుగా జరుగుతున్న డ్రామా అంతా.. బీజేపీ, షర్మిల కలిసి చేస్తున్నారని కవిత చెప్పారు. దీంతో షర్మిల వెంటనే స్పందించారు. ” పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు..” అంటూ కౌంటర్ ఇచ్చారు.
అయితే సాహిత్యంలో తండ్రికి తగ్గ తనయగా కాకపోయినా మంచి అభిరుచి ఉన్న నేతగా పేరు తెచ్చుకుని జాగృతిని నడుపుతున్న కవిత ఊరుకుంటారా.. వెంటనే.. కాస్త పొడవైన కవితతోనే కౌంటర్ ఇచ్చారు. అమ్మా.. కమల బాణం అటూ ప్రారంభించి.. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని.. మీరు కమలం కోవర్టు ..ఆరేంజ్ ప్యారేట్టు అని పేరడీలతో.. తాను ఉద్యమంలో నుంచే పుట్టానని తేల్చారు. కవిత ట్వీట్‌ను టీఆర్ఎస్ నేతలు వైరల్ చేసుకున్నారు.
ఇప్పటికైతే షర్మిల ఇంకా ఎలాంటి కవితతో రిప్లయ్ ఇవ్వలేదు. మంచి రైటర్ దగ్గర్నుంచి పంచ్ కవిత కోసం చూస్తున్నారేమో కానీ..,అది వచ్చాక రిప్లయ్ ఇవ్వొచ్చు. మొత్తానికి షర్మిల, కవితల సాహిత్య రాజకీయం మాత్రం వైరల్ అవుతోంది.