దాదాపుగా మూడేళ్లుగా మంత్రిగా ఉన్న పేర్ని నాని గురించి ఏపీలో తెలియని వారుండరు. వైసీపీ మార్క్ భాషను ఆయన పవన్ పై ప్రయోగించడంలో ముందుంటారు. జగన్కు విధేయంగా ఉంటారు. కానీ ఆయనకు వైసీపీలో అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. బందరు పోర్టుకు ఫలానా తేదీన శంకుస్థాపన చేస్తామని జగన్.. ఎంపీ బాలశౌరితో ప్రకటింపచేశారు. పేర్నినానికి కనీస సమాచారం కూడా లేదు.
చిలీపట్నం పోర్టు కోసం ప్రజలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నవయుగ కంపెనీ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించింది. కానీ వైఎస్ఆర్సీపీ సర్కార్ వచ్చిన తర్వాత పోర్టు కాంట్రాక్టును రద్దు చేశారు. దీంతో మూడున్నరేళ్లుగా అక్కడ పనులు పెండింగ్లో ఉండిపోయాయి. ఇప్పుడు కొత్తగా మేఘా కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు . తర్వాత జగన్ పుట్టిన రోజు నాడు శంకుస్థాపన చేస్తామని బాలశౌరి ప్రకటించారు.
ఎక్కడ నుంచో మచిలీపట్నం వచ్చి పోటీ చేస్తే బాలశైరిని గెలిపించిన తమను ఇలా అవమానించడం ఏమిటని పేర్ని నాని వర్గీయులు రగిలిపోతున్నారు. పేర్ని నాని కూడా ప్రెస్ మీట్ పెట్టి.. బందర్ పోర్టు పనులు జగన్ పుట్టిన రోజు నాడు ప్రారంభం కావని తేల్చేశారు. పనులు.. రెండు, మూడు నెలల్లో ప్రారంభమవుతాయని ప్రకటించారు. జగన్ పుట్టిన రోజు పనులు ప్రారంభమవుతాయన్న ఎంపీ ప్రకటన గురించి తనకేమీ తెలియనట్లుగా పేర్ని నాని వ్యవహరించారు.
గుంటూరుకు చెందిన వల్లభనేని బాలశౌరికి జగన్మోహన్ రెడ్డి సామాజిక సమీకరణాల కారణంగా మచిలీపట్నం ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. అక్కడ ఆయన విజయం సాధించారు. మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పేర్ని నానికి ఆయనకు విభేధాలొచ్చాయి. ఎంపీ తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని పేర్ని నాని అసహనానికి గురవుతున్నారు. వారి మధ్య పలుమార్లు వివాదాలు రావడంతో.. హైకమాండ్ జోక్యం చేసుకుని సర్దుబాటు చేసింది. కలసి పని చేయాలని సూచించింది. అయినా మార్పు రాలేదు. వల్లభనేని బాలశౌరికి జగన్తో వ్యాపార సంబంధాలు ఉండటంతో ఆయనకే హైకమాండ్ వద్ద ప్రాధాన్యత లభిస్తోంది. దీంతో పేర్ని నాని చిన్న బుచ్చుకోవాల్సి వస్తోంది.