జాతీయ మీడియా మొత్తం బీజేపీ అనుకూల, వ్యతిరేక మీడియాగా మారిపోయింది. మొత్తంగా బీజేపీని.. కేంద్ర నిర్ణయాల్ని అడ్డగోలుగా సమర్థించే మీడియానే మొత్తం కమ్మేసింది. ఎవరైనా ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే.. వ్యతిరేక మీడియాగా ముద్ర వేసేశారు. అలాంటి ముద్ర ఎన్డీటీవీపై పడింది. బీజేపీ విధానాలను ప్రశ్నించడం.. నిజాలను నిర్భయంగా చెప్పడంలో ఎన్డీటీవీ కాస్త ముందు ఉంది. అందుకే ఆ చానల్ చాలా కాలంగా ఈడీ ఇతర కేసులు ఎదుర్కొంటోంది. ఇప్పుడీ చానల్ వాయిస్ కూడా మారిపోతోంది.
ఈ చానల్‌ను అదానీ కొనడమే కాదు.. సంస్థ నుంచి ఎన్డీటీవీ ప్రమోటర్లు అయిన ప్రణయ్ రాయ్, రాధికారాయ్ లను బయటకు పంపేస్తున్నారు. వీరు డైరక్టర్ల పదవులకు రాజీనామాలు చేశారు. వీరి స్థానంలో అదానీ గ్రూప్ నుంచి ముగ్గుర్ని డైరక్టర్లుగా చేర్చారు. ఎన్డిటివి మెజార్టీ షేర్లు ఇప్పటికే అదానీ గ్రూప్ దక్కించుకుంది. యాజమాన్యపు హక్కులను కూడా సొంతం చేసుకుంది.
ఎన్డిటివిలో అదానీ గ్రూప్‌నకు 29.18 శాతం ఈక్విటీ వాటాగా లభించింది. అలాగే, బహిరంగ మార్కెట్ ద్వారా ఈ మీడియా సంస్థకు చెందిన మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. నవంబర్ 22న ప్రారంభమైన ఈ ఆఫర్ డిసెంబర్ 5న ముగియనుంది. మొత్తంగా ఎన్డిటివిలో ప్రస్తుతం అదానీ గ్రూప్ 55.18 శాతం వాటా దక్కించుకుంది. అయితే తమ సమ్మతి లేకుండానే అదానీ గ్రూప్ టేకోవర్ చర్యలు చేపట్టిందని ఎన్డిటివి ప్రమోటర్లు పేర్కొన్నా ప్రయోజనం లేకపోయింది. అందుకే ఇక ఆటోమేటిక్‌గా ఎన్డీటీవీ ఎడిటోరియల్ పాలసీ కూడా మారిపోనుంది.