రాజధాని విషయంలో సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పును సవ్యంగా చెప్పడానికి వైసీపీ నేతలతో పాటు కూలి మీడియాగా ప్రచారం పొందుతున్న సంస్థలు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికీ కూడా ప్రత్యేకమైన ఎజెండాతో వ్యవహరిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును సజ్జల రామకృష్ణారెడ్డి రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. తాము అనుకున్నట్లే వచ్చింది కాబట్టి బిల్లు మరింత పటిష్టంగా పెడతామని చెబుతున్నారు. స్పీకర్గా ఉండి రాజకీయంగా అనుచిత వ్యాఖ్యలు ..కోర్టులపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే తమ్మినేని సీతారాం కూడా కొత్త బిల్లు పెట్టడానికి అడ్డంకులు తొలగిపోయాయని ప్రకటించారు.
కొత్త బిల్లు పెడతామంటూ అదే పనిగా సజ్జల సహా వైసీపీ నేతల ప్రకటనలు!
వైసీపీ నేతులు వ్యూహాత్మకంగా మూడు రాజధానుల బిల్లు మళ్లీ పెట్టడానికి అడ్డంకులు తొలగిపోయాయని ప్రచారం చేస్తున్నారు. సుప్రీంకోర్టులోజస్టిస్ నాగరత్న వాదనల సమయంలో చట్టాలు చేయకుండా ప్రభుత్వాన్ని ఆపలేము కదా అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దానిపై రైతుల తరపు లాయర్ శ్యాందివాన్ తన వాదన వినిపించారు. అది వాదనల్లోనే జరిగింది. కానీ తీర్పులో మాత్రం అలాంటి ప్రస్తావన లేదు. కంటిన్యూస్ మాండమస్పై స్టే ఇవ్వలేదు. కానీ.. న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను తీర్పుగా అన్వయించుకుని.. బిల్లు పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరిస్తూ జోరుగా ప్రచారం !
రెండు రోజుల నుంచి వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు వ్యూహాత్మకంగానే ఉన్నాయని ఎవరికైనా అర్థం అవుతుంది. తాము చెప్పిందే సుప్రీంకోర్టు తీర్పు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మాత్రం వారు ఏ మాత్రం చెప్పడం లేదు. బిల్లు పెట్టుకోవడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చిందన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇదంతా కోర్టు ధిక్కరణకు పాల్పడి అయినా సరే మూడు రాజధానుల బిల్లు పెట్టాలనుకుంటున్న ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్లుగానే వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారన్న అనుమానం వ్యక్తమవుతోంది.
న్యాయవ్యవస్థపై ప్రజల్ని రెచ్చగొట్టే వ్యూహమా ?
న్యాయవ్యవస్థను వైసీపీ నేతలు ఎప్పుడూ గౌరవించలేదు. తమకు అనుకూలంగా ఉన్న వ్యాఖ్యలను మాత్రం తీర్పులుగా హైలెట్ చేసుకుంటున్నారు. అనుకూల మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు తీర్పును పట్టించుకోరు. మొత్తంగా తీర్పు వ్యతిరేకంగా వస్తే సోషల్ మీడియాలో తిట్లు అందుకోవడం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి .. మూడు రాజధానులను అడ్డుకుంటున్నారని చెప్పుకుని జగన్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.