తెలంగాణలో రెండు రోజులుగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల హాట్ టాపిక్ అవుతున్నారు. ఆమె పాదయాత్రపై దాడి జరిగిన దగ్గర్నుంచి రాజకీయం ఆమె చుట్టూనే తిరుగుతోంది. టీఆర్ఎస్ షర్మిల పార్టీని బీజేపీ వదిలిన బాణం అని అంటోంది. బీజేపీ షర్మిలకు మద్దతు తెలుపుతోంది. ఈ రాజకీయం ఏమిటో కానీ.. షర్మిలను బేస్ చేసుకుని టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేయడం ఆసక్తి రేపుతోంది.
షర్మిల పాదయాత్రను మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. మొదట్లోనే కాదు ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. అందుకేనే ఆమె దుర్భాషల బాట ఎంచుకున్నారు. పాదయాత్రలో టీఆర్ఎస్ నేతలను తిట్టడం ప్రారంభించారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ నర్సంపేట వచ్చే సరికి దాడులు చేశారు. తర్వాత హైదరాబాద్‌లో సీన్ క్రియేట్ చేశారు. ఇదంతా టీఆర్ఎస్ ప్రోత్సాహమేనని చెప్పాల్సిన పని లేదు. ప్రత్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చి రాజకీయం చేయడంలో టీఆర్ఎస్ స్టైలే వేరు. అందుకే కావాలనే షర్మిలకు టీఆర్ఎస్ ఎలివేషన్ ఇచ్చిందని రాజకీయవర్గాలు నమ్ముతున్నాయి.
అయితే అనూహ్యంగా షర్మిలకు బీజేపీ మద్దతుగా నిలుస్తోంది. ఆమె విషయంలో ప్రభుత్వం తీరును ఖండిస్తోంది. గవర్నర్ స్వయంగా మద్దతు పలికారు. ఈ క్రమంలో గవర్నర్‌ను షర్మిల కలవనున్నారు. అందుకే టీఆర్ఎస్ నేతలు ఆమెను బీజేపీ వదిలిన బాణం అంటూ ప్రచారం చేస్తున్నారు. వ్యతిరేక ఓటును షర్మిల రెండు, మూడు శాతం చీల్చినా చాలు టీఆర్ఎస్కు మేలేనని అందుకే టీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని అంటున్నారు. అదే సమయంలో షర్మిల పార్టీకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంక్ కాబట్టి.. ఆమెకు మద్దతుగా నిలవడం ద్వారా ఆ ఓటు బ్యాంక్‌ను ఆకర్షించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మరో వర్గం భావిస్తోంది.