లిక్కర్ స్కాం వ్యవహారంలో కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు కూడా ఉంది. ఆయనకూ ఈడీ నోటీసులు జారీ చేయవచ్చని.. అరెస్ట్ చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన భిన్నమైన వాదనను తెరపైకి తెచ్చారు. లిక్కర్ స్కాం..దక్షిణాది వ్యాపారులపై ఉత్తరాది వ్యాపారులు- చేస్తున్న కుట్రగా ఆయన తేల్చారు. అలా అన్న ఆయన .. తాను అసలు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారమే చేయలేదని అంటున్నారు. సౌత్ లాబీ పేరుతో ప్రత్యేకంగా గ్రూప్ పెట్టుకుని వందల కోట్లు లంచాలు ఇచ్చి.. ఢిల్లీలో లిక్కర్ బిజినెస్‌ను సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ కేసులో ఇప్పటికే శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. మాగుంట కుటుంబం లిక్కర్ బిజినెస్‌లో పేరు మోసింది. పలు ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తి వారి డిస్టిలరీల్లోనే ఉంటుందని చెబుతూంటారు. అయితే ఇప్పుడు తమకు లిక్కర్ బిజినెస్‌లు లేవని ఆయన చెబుతున్నారు. కానీ ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పేరుతో ఉన్న రెండు కంపెనీలు.. ఢిల్లీలో రెండు జోన్లలో మద్యం వ్యాపారాన్ని కైవసం చేసుకుంది.
కానీ ఎంపీ మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. సౌత్ గ్రూప్‌లో కవిత పేరు కూడా ఉంది. అయితే శరత్ చంద్రారెడ్డి, మాగుంటలకు మద్యం బిజినెస్‌లు ఉన్నాయి.. మరి కవితకు ఎలా సంబంధం ఉంది.. ఎందుకు ముడుపులు చెల్లించారన్నదానిపై మాత్రం ఈడీ ఎలాంటి వివరాలు బయట పెట్టలేదు. అందుకే ఈ కేసు విషయం రాను రాను ఆసక్తికరంగా మారింది.