ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కుమార్తె , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఓ నిందితుడి రిమాండ్ రిపోర్టులో చూపించారు. అంతే తెలంగాణలో ఒక్క సారిగా రాజకీయ వాతావరణం గంభీరంగా మారిపోయింది. కవితకు మద్దతుగా ఆమె పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటికి తరలి వచ్చి సంఘిభావం ప్రకటించారు. ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అసలు అమిత్ అరోరా అనే వ్యక్తి చార్జిషీట్లో కవిత చేసిన నేరం ఏమిటో మాత్రం ఈడీ చెప్పలేదు. ఫోన్లు మార్చారని.., సౌత్ లాబీ అని.. చెప్పారు కానీ.. అసలు ఈడీ చెప్పిన దానికి.. కవితకూ ఎక్కడా లింక్ అర్థం కావడం లేదు.
శరత్ రెడ్డి, మాగుంట మద్యం వ్యాపారులు – మరి కవితకేంటి సంబంధం ?
సౌత్ లాబీ పేరుతో వంద కోట్లు ఆప్ నేతలకు చేర్చారని..ఇందులో కవిత కీలక పాత్ర అని ఈడీ చెప్పింది. అదే సమయంలో శరత్ చంద్రారెడ్డి, మాగుంట గురించి ప్రస్తావించారు. వీరిద్దరూ మద్యం వ్యాపారులు. వీరికి కొన్ని జోన్లలో మద్యం అమ్మకాల లైసెన్స్ దక్కింది. అందుకే వీరు ముడుపులు చెల్లించి ఉండవచ్చు. మరి కవితేం సంబంధం ? ఈ విషయంలో ఈడీ ఇంత వరకూ సరైన క్లారిటీ ఇవ్వలేదు. అసలు కవితకు మద్యం వ్యాపారం ఉందని కానీ.. మరొకటి కానీ ఇంత వరకూ చెప్పలేదు. కానీ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో చేర్చారు.
ఫోన్లు మారిస్తే.. ఢిల్లీకి ప్రయాణిస్తే నేరం అయిపోతుందా ?
రెండు పోన్ నెంబర్లను ఉపయోగిస్తూ కవిత పది ఫోన్లు మార్చారని ఈడీ రిమాండ్ రిపోర్టులో చెప్పింది. కవిత పది కాకపోతే ఇరవై పోన్లు మార్చుకుంటారు అది ఆమె ఇష్టం. అది నేరంగా చెప్పడానికి ఎలా ప్రాతిపదిక అవుతుందనేది ఎక్కువ మందికి వస్తున్న సందేహం. అదే సమయంలో ఆమె పాత్ర గురించి ఇంక పెద్దగా ప్రస్తావించలేదు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టును బట్టి చూస్తే.. కవిత పేరును ప్రస్తావించారు కానీ.. ఆమె ఎలా నేరం చేశారు.. ? అలా ముడుపులు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలాలనుకున్నారు ? లేకపోతే పొందారు అన్న అంశాలపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. వాటి గురించి చెప్పకుండా కవితను నేరం చేశారని ప్రచారం చేయడం రాజకీయమే అవుతుంది.
ఢిల్లీ మద్యం వ్యాపారంలో బయటకు తెలియని వ్యాపారులు దక్కించుకున్న జోన్లు కవితవేనా ?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. నేరం చేసినట్లుగా నిరూపించాలంటే.. ముందుగా ఆమె ఫలానా ప్రయోజనం పొందారని చెప్పాలి. ఆ ప్రయోజనం పొందడానికి అక్రమానికి పాల్పడినట్లుగా నిరూపించాలి. కానీ ఇప్పటి వరకూ అలాంటిదేమీ లేదు. అమిత్ అరోరా రిపమాండ్ రిపోర్టులో .. ఢిల్లీలోని 32 జోన్లలో మద్యం లైసెన్స్లు దక్కించుకున్న ఎక్కువ మంది అసలైన యజమానులెవరో తెలియదని.. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉందని పెట్టారు. బుహశా.. ఆ మద్యం లైసెన్స్లు కవితకు సంబంధించినవి అయితేనే ఇంత రాద్దాంతం చేస్తారు. లేకపోతే చేయరు. అవి కవితని నిరూపించిన తర్వాతే ఆమెపై ఆరోపణలు చేస్తే ఎవరైనా నమ్ముతారు.. లేకపోతే రాజకీయం అనుకుంటారు.