తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ చనిపోయిన 709 రైతు కుటుంబాలకు 1010 చెక్కులు పంపిణీ చేశారు. మేలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లడం లేదంటూ అక్కడి రైతులు కొందరు ఇక్కడి మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ అంశంపై కేసీఆర్ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న తెలంగాణ సర్కార్ వెంటనే విచారణ చేసింది. చెక్కులన్నీ క్లియర్ అయ్యాయని చెబుతోంది.
మేలో కేసీఆర్ 1010 చెక్కులను పంపిణీ చేశారని.. అందులో 814 చెక్కులకు నగదు చెల్లింపులు ఇప్పటికే జరిగాయని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా చెక్కులు చెల్లింపులు జరగకపోవడానికి కూడా ప్రభుత్వం కారణం కాదన్నారు. బ్యాంకు నిబంధనల మేరకు, నిర్దేశిత 3 నెలల సమయం లోపల ఆ చెక్కులను ఆ యా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి వుంటుంది. అట్లా చేయకపోవడం వల్ల మిగిలిన కొన్ని చెక్కులకు నగదు చెల్లింపులు నిలిపివేశారని ప్రకటించారు. ఇది చెక్కులను నిర్దేశిత సమయంలో డిపాజిట్ చేయకపోవడం వల్ల జరిగిన సాంకేతిక పొరపాటే తప్ప మరోటికాదు. సీఎస్ సోమేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.
ఇలాంటి చెక్కులకు కూడా చెల్లింపులుచేయాలని తాము ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఇంకా ఈ విషయానికి సంబంధించి మరింత సహాయం కోసం ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ రాంసింగ్ ను సంప్రదించాలని సూచించింది. తెలంగాణ సర్కార్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట నిజమే కానీ ఇలా పరాయి రాష్ట్రంలో వారికి చెల్లని చెక్కులిచ్చేంత దుర్భర స్థితిలో లేదని తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలు చెబుతున్నారు. వారు సమయానికి చెక్కులు బ్యాంకులో వేసుకోకపోతే.. ప్రబుత్వాన్ని నిందించడం ఏమిటంటున్నారు.