తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు టీఆర్ఎస్ కీలక నేతలు మరింత ఆజ్యం పోస్తున్నారు. హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో ప్రజలకు అనేక కీలకమైన హామీలు ఇవ్వడంతో.. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరూ కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో కేటీఆర్ ప్రత్యేకంగా మునుగోడు వెళ్లి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోనూ రాబోయే 6, 7 నెలల్లో అన్ని హామీలు నెరవేరుస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలు తీరుపై చర్చించేందుకు ఐదుగురు మంత్రులతో కమిటీ వేశారు.
ఒక నియోజకవర్గం అభివృద్ధి కోసం ఐదుగురు మంత్రులు మునుగోడుకు రావడం అరుదైన సందర్భమని… రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పేందుకే తామంతా వచ్చామన్నారు. ఎన్నికల్లోపే అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గానికి ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పేందుకే ఉప ఎన్నిక ఫలితం వచ్చిన నెల రోజుల లోపే తామంతా వచ్చామని మంత్రి కేటీఆర్ ప్రజలకు చెప్పుకున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోడ్ల నిర్మాణాలు, పునరుద్ధరణ కోసం రూ.402 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు రూ.700 కోట్లు, మున్సిపల్ శాఖ ద్వారా.. రూ. 334 కోట్లు మొత్తంగా రూ.1544 కోట్ల నిధులను 12 నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్క మునుగోడులో రూ.100 కోట్ల ఖర్చుతో రోడ్ల మరమ్మతులు చేపడుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత ఒక మాట తమ సిద్ధాంతం కాదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.