ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను బంధువులు, వ్యాపార బినామీలతో నింపేయడానికి విజయసాయిరెడ్డి వేసిన స్కెచ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది . ఎన్నికల్లేకుండా ఏకగ్రీవంగా పదవులు కైవసం చేసుకుందామనుకున్నారు కానీ చివరి క్షణంలో హైకోర్టు బ్రేక్ వేసింది. ఏసీఏ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చింది. అక్రమాలకు పాల్పడ్డారంటూ చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ హైకోర్టులో పిటిషన్ వేసి.. అక్రమాల వివరాలన్నింటినీ కోర్టు ముందు ఉంచారు.
2019 నుంచి మూడేళ్ల పాటు శరత్ చంద్రారెడ్డి అధ్యక్ష పదవిలో ఉన్నారు. ఆయన పదవీ కాలం 26-09-2022 తేదీన ముగిసిపోయింది. అంటే ఆ రోజు నుంచి శరత్ చంద్రారెడ్డికి కానీ పాలకమండలిలలో ఉన్న వారికి కానీ ఏసీఏలో ఎలాంటి అధికారాలు లేనట్ే. కానీ మరసటి రోజునే జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి… ఎలక్టోరోల్ ఆఫీసర్ ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఉన్న పాలక మండలినే మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నుకునేలా నామినేషన్స్ వేయించారు.
క్రికెట్ పాలనా వ్యవహారాల్లో సుప్రీంకోర్టు నియమించిన లోథా కమిటీ సిఫార్సులు, అంబుడ్స్ మెన్ నియామకంలో నిబంధన పాటించకపోవడాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం కోర్టు నిర్ధేశించిన నియమాల్లో దేన్నీ పాటించలేదని.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మూడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో 13 మంది ఓటు వేయాల్సింది. 15 మంది సోషల్ క్లబ్ మెంబర్స్ కి ఓటు హక్కు లేదని తెలిసినా.. వారికి ఓటు హక్కు ఇప్పించి అక్రమంగా విజయం సాధించారు. ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
డిసెంబర్ మూడో తేదిన ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని ఎలక్టోలర్ ఆఫీసర్ చెప్పినందున ఎన్నికలను రద్దు చేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. దీంతో కేసు తేలేంత వరకు ఎన్నికల ఫలితాలు ఇవ్వరాదని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 14కి వాయిదా వేశారు.