ఇంటింటికి డబ్బులిస్తున్నాం.. అంటే.. ఇంటింటికి మేలు చేయడమేనని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. అయినా ప్రజల్లో అసంతృప్తి ఎందుకో జగన్కు అర్థం కావడం లేదు. అందుకే మరో సర్వే చేయిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. శాచురేషన్ అనేది సీఎం నోటి వెంట పదే పదే వస్తుంది. అంటే సంతృప్త స్థాయిలో పథకాలు ఇవ్వాలనేది ఆయన లక్ష్యం. అలా ఇస్తున్నామని చెబుతున్నారు. కానీ ఎక్కడా ప్రభుత్వానికి సానుకూలత కనిపించడం లేదు.
గడప గడపకూ మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలను పలుచోట్ల ప్రజలు నిలదీశారు. దీంతో ప్రజా ప్రతినిధులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా మందికి అసలు ఇవ్వకుండానే లక్షలు ఇచ్చినట్లు చెప్పడం ఒకటి అయితే.. ఎప్పుడూ ఇచ్చే ప్రభుత్వ పథకాలను కూడా ఇప్పుడు కొత్తగా ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడంతో ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోంది. అందే కాదు పథకాల పేరుతో తమపై పెద్ద ఎత్తున భారం వేశారన్న అభిప్రాయం వారిలో కనిపిస్తోంది. అదే సమయంలో కొన్ని పాత పథకాలు ఆపేయడంతో ఇబ్బంది పడుతున్నవారు ఎక్కువ మంది ఉన్నారు.
ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలన్నదానిపై… వైసీపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. లబ్దిదారుల్లో అసంతృప్తిపై ప్రత్యేకంగా సర్వే చేస్తున్నారు. ఆ తర్వాత మరో విడత ప్రజా ప్రతినిధులందరూ ఇంటింటికీ వెళ్లే కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ వ్యూహకర్తలు రెడీ చేస్తున్నారు. గడప గడపకూ ప్రోగాం.. జనవరితో పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో విడత జనంలోకి పార్టీ నేతలను పంపనున్నారు. ఎన్నికయ్యే వరకూ ప్రజల్లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. అసంతృప్తిని తగ్గించడమే లక్ష్యమంటున్నారు.