టీఆర్ఎస్ అధికారికంగా అంతర్థానం అయిపోయింది. భారత రాష్ట్ర సమితి అవతరించింది. కేసీఆర్ తమ పార్టీ నినాదాన్ని ప్రకటించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ భారత రాష్ట్ర సమితి నినాదం అని పేర్కొన్నారు. ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయేది రైతు ప్రభుత్వమే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ పాలసీలు రూపొందిస్తామన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ప్రచారం నిర్వహిస్తాం. కుమారస్వామి కర్ణాటక సీఎం కావాలన్నారు. నాలుగైదు నెలల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభమవుతుందన్నారు. ఢిల్లీలో భారీ బహిరంగసభ పెట్టి బీఆర్ఎస్ విధాన ప్రకటన చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.
వచ్చే ఏప్రిల్ లోపు.. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ కూడా పోటీ చేస్తోంది. జేడీఎస్.. బీఆర్ఎస్తో కలిసి నడవాలని నిర్ణయించుకుంది. ఈ రోజు తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమానికి కూడా జేడీఎస్ నేతకుమారస్వామి హాజరయ్యారు. బీఆర్ఎస్ నెక్ట్స్ టార్గెట్ కర్ణాటక అని.. అక్కడ కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతు ఇస్తామన్నారు కేసీఆర్. పోటీ చేసే అవకాశం లేదని.. కేవలం జేడీఎస్‌కు మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత వచ్చే తొలి ఇతర రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎలా అనే వాదన ఇప్పటికే వినిపిస్తోంది.
బీఅర్ఎస్ విషయంలో కేసీఆర్ పూర్తి కసరత్తును పూర్తి చేయనట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేకంగా జెండాను కూడా సరిగ్గా రూపకల్పనచేయలేకపోయారు. పాత జెండాలో తెలంగాణ స్థానంలో ఇండియా మ్యాప్‌ను పెట్టి.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చి మ.. మ అనిపించారు. సరైన ఫ్లెక్సీలు.. బ్యానర్లు కూడా రెడీ చేసుకోలేకపోయారు. బీఆర్ఎస్ జెండా ఎగురవేశారు కానీ.. ఎవరికీ కొత్తగా అనిపించలేదు. ఎప్పుడు ఢిల్లీ నుంచి పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తారో మాత్రం ఇంకా క్లారిటీ ఇవవలేదు. ముందుగా అన్ని రాష్ట్రాల్లో కార్యవర్గాలను నియమించడంతో పాటు పార్టీకి ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం అనేక పార్టీలు, నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇవన్నీ కొలిక్కి వచ్చిన తర్వాత… కెసిఆర్ రంగంలోకి దిగే అవకాశం ఉంది.