ఏపీ వైసీపీ నేతల్లో మంత్రుల పంచాయతీ ఇంకా అంతర్గతంగానే కొనసాగుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ప్రస్తుతం ఒకే మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఆయనకు ఎవరితోనూ సరి పడదు. ఇంతకు ముందు ఇద్దరు మంత్రులు ఉండేవారు. పేర్ని నాని, కొడాలి నాని ఇద్దరూ స్నేహంగానే రాజకీయాలు చేసేవారు. అయితే జగన్ ఇద్దర్నీ తీసి పక్కన పెట్టారు. జోగి రమేష్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. జోగి రమేష్ పై ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు.. కానీ ఇప్పుడు ఆయనపై కొడాలి నాని సెటైర్లు ప్రారంభించారు.
మా జేబిలో మనిషి జోగి రమేష్ అని కొడాలి నాని తేల్చేశారు. ఆయన మంత్రి అయ్యారంటే.. తాను మాత్రమే కాకుండా.. పేర్ని నాని, వల్లభనేని వంశీ కూడా మంత్రులయినట్లేనని తేల్చేశారు. ఇదంతా ఎందుకంటే..మంత్రి పదవులు ఇవ్వకపోవడం గురించే. పేర్ని నాని, కొడాలి నాని మంత్రులుగా ఉన్నప్పుడు జోగి రమేష్.. తనకు మంత్రి పదవి కోసం చేయని విన్యాసం లేదు. నేరుగా చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లి జగన్ మెప్పును పొందారు. తర్వాత అసెంబ్లీలో రఘరామరాజును బండబూతులు తిట్టారు. అన్నీ కలిపి ఆయనకు మంత్రి పదవి వచ్చింది.
అయితే పదవిలో ఉండి.. అంత కంటే ఎక్కువ తిట్టిన పేర్ని నాని, కొడాలి నానిలకు మాత్రం చాన్స్ లేకుండాపోయింది. వారిద్దిరి సీట్లు గల్లంతయిపోయాయి. కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కొడాలి నాని.. ఆ తర్వాత తన కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నా.. స్పందించడం లేదని ముగ్గురు మంత్రుల్ని తొలగిస్తానని జగన్ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే రేసులోకి వచ్చారు. మళ్లీ తనదైన బూతుల విధేయత చూపించడం ప్రారంభించారు. మరి ప్రతిఫలం వస్తుందో లేదో !