రెండు రాష్ట్రాలను కలపడానికే మా ఓటు అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నుంచి చాలా ఘాటు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణ నేతలు… తెలంగాణ పార్టీలు విమర్శించడంలో ఓ అర్థం ఉంది.. కానీ అనూహ్యంగా.. షర్మిల నుంచి కూడా సజ్జలకు రివర్స్ ఎటాక్ ఎదురయింది. ముందు రాష్ట్రం గురించి.. రాష్ట్ర ప్రయోజనాల గురించి చూసుకోవాలని షర్మిల సలహా ఇచ్చారు.
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ సోదరి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడవద్దని నేరుగా హెచ్చరికలు పంపారు. సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివన్నారు. నేడు తెలంగాణ ఒక వాస్తవం అని గుర్తు చేశారు. ఎంతోమంది బలిదానాలు, ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని.. రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యమని స్పష్టం చేశారు. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయని.. విభజిత రాష్ట్రాలను ఎలా కలుపుతారని ప్రశ్నించారు. మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు, మీ ప్రాంత అభివృద్ధి మీద అని హితవు పలికారు. మీ హక్కుల కోసం పోరాటం చేయండి.. మీ ప్రాంతానికి న్యాయం చేయండన్నారు.
షర్మిల స్పందన చూసిన తర్వాత సోషల్ మీడియాలో సజ్జలపై చాలా సెటైర్లు పడుతున్నాయి. ముందు తెలుగు రాష్ట్రాలను కాదని.. జగన్, షర్మిలను కలపాలని ఆయనకు సూచిస్తున్నారు. అటు జగన్కు..ఇటు జగన్ ఫ్యామిలీ మధ్యలో సజ్జల అడ్డుగోడలా ఉన్నారని చాలా కాలంగా ఆరోపణలు వస్తన్నాయి. ఇప్పుడు ఈ విషయం లో ఆయనపై సెటైర్లు పడుతున్నాయి. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో మరి !