సాక్షి పత్రికను కొనేందుకు ఇప్పటికే లక్షల మంది వాలంటీర్లు ఒక్కొక్కరికి నెలకు రూ. రెండు వందలు చొప్పున ఇస్తున్న ప్రభుత్వం… తాజాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకూ అలాగే డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది. నాలుగు నెలలకు పది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సచివాలయ ఉద్యోగులు అత్యధిక సర్క్యులేషన్ ఉండే న్యూస్ పేపర్ల కొనుగోలుకు నెలకు రూ.200 చొప్పున 2023 మార్చి వరకూ మంజూరు చేస్తూ గ్రామ, వార్డు సచివాలయాలశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా న్యూస్ పేపర్ ఓచర్ డిడిఓకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు న్యూస్ పేపర్లు కొనుగోలు చేయడం ఉపయోగపడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. తప్పని సరిగా వారంతా సాక్షినే కొనాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు ఉద్యోగులు జీతాలు రాక అల్లాడిపోతున్నారు. కానీ సాక్షి కి మాత్రం ప్రజాధనాన్ని ఇష్టారీతిన దోచి పెడుతున్నారు. సాక్షి పత్రికను ఇప్పటికి ప్రభుత్వంలో అన్ని స్థాయిలో కొనిపిపిస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండు సాక్షి పత్రికలను ఉంచుతున్నారు. అది సరిపోదన్నట్లుగా ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు డబ్బులిచ్చి మరీ కొనిపిస్తున్నారు. వాలంటీర్లకూ డబ్బులిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లోనే కాదు.. అధికారం ఉన్న ప్రతీ చోటా కొనిపిస్తున్నారు. ఇక ప్రభుత్వ శాఖల ప్రకటనలు గురించి చెప్పాల్సిందేమీ లేదు. వందల కోట్లు ప్రకటనల రూపంలో సాక్షి పత్రికకు తరలిపోతున్నాయి. అదే సమయంలో సాక్షి నుంచి ఔట్ సోర్సింగ్ పేరుతో ప్రభుత్వంలోకి వచ్చి పని చేయకుండా జీతాలు తీసుకుంటున్న వారు వేలల్లో ఉన్నారు. ఏపీ ప్రజలకు సాక్షిని పోషించండం ఓ బాధ్యతగా మారిపోయినట్లుగా ఉంది.