వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్‌ను కొంత మంది హ్యాక్ చేశారు. ఆ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా క్రిప్టోను ప్రమోట్ చేసుకుంటున్నారు. అర్థరాత్రి ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయినట్లుగా తెలుస్తోంది. అర్థరాత్రి తర్వాత నుంచి హఠాత్తుగా సంబంధం లేని కొత్త పోస్టులు వచ్చాయి. క్రిప్టోకు సంబంధించిన సమాచారాన్ని రీ ట్వీట్ లు చేస్తున్నారు. ఎలన్ మస్క్ ఎన్ఎఫ్టీలు ఫ్రీగా ఇస్తున్నారని స్వయంగా వైసీపీ పార్టీ తరపున ట్వీట్ చేశారు. అయితే విచిత్రం ఏమిటంటే.. హ్యాక్ చేసిన వాళ్లు ఇదంతా చేస్తున్నారు కానీ.. పేరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఉంచారు.
బయోను మాత్రం మార్చేశారు. ఎన్ ఎఫ్టీ మిలియనీర్, అమెరికా అని మార్చేశారు. ఈ ప్రకారం ట్వీట్లు చేస్తున్నారు. అయితే హ్యాక్ చేసిన వాళ్లు పేరు ఎందుకు మార్చలేదన్నది సస్పెన్స్ గా మారింది. ఇలా భారీగా ఫాలోవర్లు ఉన్న ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ కావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతా రెండు సార్లు హ్యాక్ అయింది. అతి కష్టం మీద వాటిని పునరుద్ధరించుకోగలిగారు. ఇప్పుడు వైసీపీ బాధితురాలిగా మారింది. అప్పట్లో టీడీపీ మీద వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సెటైర్లు వేశారు.. ఇప్పుడు టీడీపీ వాళ్లు ఆ పని చేస్తున్నారు.
ట్విట్టర్ లో వ్యవస్థ గతంలోలా లేదు. చాలా వరకూ మ్యాన్ పవర్ తొలగించారు. దీంతో హ్యాక్ అయిన ఖాతాలను వేగంగా తిరిగి తెచ్చుకోవడం కష్టంగా మారుతోంది. సాఫ్ట్ వేర్ స్లో అయిపోయిందన్న అభిప్రాయం ఎక్కువ మంది వినియోగదారులు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఖాతా హ్యాక్ అయిందని తెలిసిన వెంటనే.. ఆ పార్టీకి చెందిన టెక్ నిపుణులు.. మళ్లీ పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఖాతాలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు చూస్తున్నారు.