బీఆర్ఎస్ పార్టీతో జాతీయ స్థాయికి వెళ్తున్న కేసీఆర్ ఒకప్పుడు తాను మంత్రిగా చేసిన రాష్ట్రంలో భాగం అయిన ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించకుండా ఉండరు. ఎవరో ఒక పేరున్న నేతను లైన్లో పెట్టాలనుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ కార్యాలయాన్ని విజయవాడలోనే పెట్టాలని డిసైడయ్యారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే టీఆర్ఎస్ నేత బండి రమేష్ కు ఏపీలో బీఆర్ఎస్ కోసం ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యతను ఇచ్చారు. ఆయన కొన్ని అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలతో మాట్లాడుకుని విజయవాడలో కొన్ని ఫ్లెక్సీలు పెట్టించారు.
తాజాగా జక్కంపూడి టౌన్ షిప్ దగ్గే పార్టీ ఆఫీసు పెట్టబోతున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. 800 గజాల్లో నిర్మిస్తామని చెబుతున్నారు. అయితే … వచ్చే ఏప్రిల్ నుంచి జగన్ విశాఖ నుంచి పాలన చేయాలనుకుంటున్నారు. మూడు రాజధానులకు గతంలో కేసీఆర్..కేటీఆర్ మద్దతు పలికారు. అయినప్పటికీ విజయవాడలోనే పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దీంతో మూడు రాజధానులపై కేసీఆర్కు నమ్మకం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరో వైపు ఏపీలో బహిరంగసభ పెట్టాలా వద్దా అన్నదానిపై స్పష్టత లేదు. భారత రాష్ట్ర సమితిగా పేరును మార్చినందున ఏపీ ప్రజలు కూడా ఆదరిస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీ నుంచి రాజకీయ నేతల్ని ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఆయన ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో కానీ.. బీఆర్ఎస్ ఏపీలో అడుగుపెడితే.. ఏపీ ప్రజల్లో సెంటిమెంట్ పెరిగే చాన్స్ ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.