ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రతీవారం రాసే కొత్త పలుకుల్లో ఈ మధ్య కాలంలో ఉండాల్సినంత ఆసక్తికరమైన విషయాలు ఉండటం లేదు. అందరూ పిచ్చాపాటిగా చెప్పుకునే కబుర్లనే చెబుతున్నారు. ఈ వారం కూడా అంతే. వైసీపీ నేతలు ఏం మాట్లాడినా దానికో ప్రత్యేక వ్యూహం ఉందని.. అదనీ..ఇదనీ సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటూ ఉంటారు. అలాగే.. ఆర్కే కూడా ఈ వారం కొత్త పలుకులో స్పందించారు. సజ్జల రామకృష్ణారెడ్డి వినిపించిన సమైక్యవాదం.. కేసీఆర్ కు సాయం చేయడానికేనని.. సెంటిమెంట్ రెచ్చగొట్టడానికేనని ఆర్కే విశ్లేషించారు.
కానీ ఇక్కడ ఆర్కే డీప్‌గా ఆలోచించలేకపోయిందేమిటంటే.. స్వయంగా కేసీఆరే సెంటిమెంట్ ను త్యాగం చేసి టీఆర్ఎస్ పార్టీని మూసేసి.. బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించారు. తెలంగాణ వాదానికి ముగింపు పలికి… జాతీయ వాదాన్ని అందుకున్నారు. ఇప్పుడు కొత్తగా వైసీపీ నేతలు వినిపించే సమైక్యవాదంతో కేసీఆర్‌కు వచ్చే లాభమేంటి ?. మళ్లీ రెండు రాష్ట్రాలను కలిపేస్తారని కేసీఆర్ ప్రచారం చేయగలరా ? ఏపీలో కూడా పోటీ చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారు. తలసానికి ప్రత్యేకంగా ఏపీ బాధ్యతలిస్తున్నారు. ఇలాంటి సమయంలోనూ కేసీఆర్ ఆంధ్రుల్ని తిట్టి.. సమైక్య రాష్ట్రమంటున్నారని .. రాజకీయాలు చేయగలరా ? ఆర్కే ఈ సింపుల్ లాజిక్‌ను ఈజీగానే మిస్సయ్యారు.
అదే సమయంలో షర్మిల మద్దతు తీసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం కల్పించడానికి ప్రయత్నించారు. నిజానికి ఇప్పుడు బీజేపీ షర్మిల మద్దతు తీసుకోవడం వల్ల ఎవరికి లాభం..? షర్మిల ప్రభావం నామమాత్రంగా కూడా ఉండదని ఆర్కేకు తెలియనిది కాదు. కానీ ఎందుకో కానీ మొదటి నుంచి తన మీడియాలో షర్మిలకు ” న్యూస్ వాల్యూ”కు మించి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు షర్మిలకు బీజేపీ మద్దతు విషయంలోనూ చెబుతున్నారు. పనిలో పనిగా.. జగన్, మోదీ మధ్య సంభాషణ మీకెలా తెలిసిందంటూ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లపైనా ఆర్కే స్పందించారు. మోదీ ఫోన్ చేయలేదని.. విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తే మధ్యవర్తిని బయట పెడతానని సవాల్ చేశారు.
అయితే జగన్ విషయంలో మాత్రం ఆర్కే గతంలలోలా ఆయన పనైపోయిందని రాయడం లేదు. వ్యూహాత్మకంగా స్టైల్ మార్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఆలోచించాలన్నట్లుగా రాసుకొస్తున్నారు. గతంలో ఆయన పై తీవ్ర వ్యతిరేకత ఉందని.. పనైపోయినట్లేనని రాసేవారు. అలాంటి రాతలను ఇప్పుడు మార్చారు. జగన్ చేస్తున్న పనుల వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో వివరించి.. ప్రజల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.