పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో ఎట్టకేలకు సినిమా మొదలైంది. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ఈ చిత్రానికి లాంఛనంగా క్లాప్ కొట్టారు. అయితే సినిమా పేరు ‘భవదీయుడు భగత్ సింగ్’ కాదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’. టైటిల్ మారినా… పవర్ ఫుల్ గానే ఉంది. క్యాప్షన్ (మనల్ని ఎవడ్రా ఆపేది) అయితే ఫ్యాన్స్‌కి ఇంకా నచ్చేసింది.
అయితే… ఈ సినిమాకి తొలి అడ్డంకి టైటిల్ రూపంలోనే ఎదురవుతోంది. ఎందుకంటే.. ‘ఉస్తాద్’ అనే టైటిల్ తో ఓ సినిమా ఇదివరకెప్పుడో పట్టాలెక్కింది. వారాహి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫణిదీప్ దర్శకుడు. షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అని పెట్టుకోవడం ‘ఉస్తాద్’ టైటిల్ ని కిల్ చేయడమే. ఈ విషయంలో సాయి కొర్రపాటి ఛాంబర్‌కి వెళ్తారా? లేదంటే… పవన్ కల్యాణ్ సినిమానే కదా అని సర్దుకుపోతారా అనేది చూడాలి. గతంలోనూ ఇలాంటి టైటిల్ వివాదాలు చాలానే చెలరేగాయి. గ్యాంగ్ లీడర్, ఖలేజా సినిమాలకు టైటిల్ అడ్డంకిగా మారింది. దాంతో మహేష్ – ఖలేజా, నాని – గ్యాంగ్ లీడర్ అని మార్చుకోవాల్సివచ్చింది.