వైసీపీ ప్రభుత్వం తమ ఎన్నికల హామీ మద్యనిషేధాన్ని అమలు చేయాలని అనుకుటోంది. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మీడియాకు చెప్పారు. ప్రస్తుతం ఎన్ని షాపులు ఉన్నాయన్నది ముఖ్యం కాదని.. ఎన్ని షాపులు ఉన్నా మద్యనిషేధం విధిస్తే మూాసేయాల్సిందేనని ఆయన లాజిక్ చెబుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే… మద్య నిషేధం చేస్తానని మాటిచ్చారు. ప్రతీ ఏటా ఇరవై శాతం దుకాణాల్ని తగ్గించి.. స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యాన్ని పరిమితం చేసి ఓట్లు అడుగుతామన్నారు.
ప్రతిపక్ష పార్టీలు ఇదే అంశాన్ని తరచూ ప్రశ్నిస్తున్నాయి. అయితే మద్యంపై ఆదాయాన్ని అపరిమితంగా పెంచుకుని..ఆ ఆదాయాన్ని మరో పాతికేళ్ల పాటు తాకట్టు పెట్టి.. అప్పులు తెచ్చుకుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు మద్య నిషేధం కాదు కదా కనీసం దుకాణాల్ని కూడా నియంత్రించలేరు. అమ్మకాలు పెంచుకోవడానికి టూరిజం పేరుతో అదనంగా దుకాణాలు తెరుస్తున్నారు. అయితే మద్య నిషేధ హమీని అమలు చేశామని ఎలాగైనా చెప్పుకోవాలన్న తాపత్రయంలో ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోంది.
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై శాతం దుకాణాలు గీత కార్మికులకు కేటాయిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ వైరల్ అవుతోంది. అంటే అధికారంలోకి వస్తే లిక్కర్ పాలసీని మారుస్తారన్నమాట. ఇక్కడే చురుకుగా ఆలోచించిన వైసీపీ హైకమాండ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు మద్యాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు. ఎన్నికలు జరిగే రెండు, మూడు నెలలు మద్య నిషేధం ఉంటుంది.. తర్వాత చంద్రబాబు గెలిస్తే మద్య నిషేధం తీసేస్తారు. అప్పుడు తాము మద్యనిషేధం విధించామని..ఆయన తీసేశారని ప్రచారం చేసుకోవచ్చు. అదే జగన్ గెలిచినా తీసేస్తారు. ప్రజలే తీసేయమన్నారని వాదించడం.. ప్రశ్నించిన వాళ్లని పోలీసులతో నియంత్రించడం వారికి బాగా వచ్చు. మొత్తంగా మద్యం కేంద్రంగా ఎన్నికలకు ముందు కీలక రాజకీయాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.