తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏదీ కలసి రావడం లేదు. బీజేపీపై యుద్ధానికి తాను సృష్టించుకున్న ఆయుధం ఇప్పుడు బూమెరాంగ్ అయిపోయింది. ఈ కేసులో సిట్ ఏర్పాటు చేసి బీజేపీ అగ్రనాయకులకు నోటీసులు జారీ చేసి హడావుడి చేద్దామనుకున్నారు. అన్నంత పని చేశారు. ఇక మోదీ, అమిత్ షాలకూ నోటీసులు వెళ్తాయన్న ప్రచారాన్ని సోషల్ మీడియాలో చేశారు. చివరికి ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లింది. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ.. బీజేపీ ,నిందితులు వేసిన పిటిషన్ పై సుదీర్ఘ విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. నిర్ణయాన్ని వారికి అనుకూలంగా ఇచ్చింది. కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశించింది.
మునుగోడు ఎన్నికల ప్రచారం జరుగుతూండగా.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో నలుగురు ఎమ్మెల్యేలు.. ముగ్గురు ఇతర వ్యక్తులతో కలిసి ఉండగా పోలీసులు ట్రాప్ చేశారు. ఆ ముగ్గురూ ఆ నలుగురు ఎమ్మెల్యేలతో బేరం ఆడటానికి వచ్చారని కేసు పెట్టారు. స్వయంగా రోహిత్ రెడ్డినే ఈ కేసు పెట్టారు. తమను ప్రలోభ పెట్టడానికి వచ్చారని కేసు పెట్టారు. వీరి వెనుక చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని .. తెలంగాణ సర్కార్ సిట్ వేసింది. బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇతరులకూ జారీ చేసింది. కానీ ఎవరూ విచారణకు రాలేదు.
అందరూ సిట్ కుట్రపూరిత విచారణ అని హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సీబీఐ అసలు ఎవరు బేరం పెట్టారు..ఎవరు కొనుగోలు చేయబోయారు.. ఎంత డబ్బులు ఇస్తామన్నారు లాంటివన్నీ తేల్చనుంది. ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో ఎమ్మెల్యేలకు బేరం పెట్టిన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నందకుమార్ రోహిత్ రెడ్డి బిజినెస్ పార్టనర్ అని తేలింది. ఇదే కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు పోటీగా ఈ కేసును తెరపైకి తెచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు కూడా.. టీఆర్ఎస్ నేతలకు గుదిబండగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.