తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రపతికి స్వాగతం పలికారు కానీ.. ఆమె గౌరవార్ధం రాజ్ భవన్ లో ఇస్తున్న విందుకు మాత్రం హాజరు కాలేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. తమిళిశైను కూడా కేసీఆర్ నవ్వుతూనే పలకరించారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా కేసీఆర్ స్వాగతం పలకడం లేదు. రాష్ట్రపతికి కూడా సీఎ కేసీఆర్ స్వాగతం పలుకుతాడా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే కేసీఆర్ ముర్ముకు స్వాగతం పలకడం ఆసక్తికరంగా మారింది.
నిజానికి రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు కేసీఆర్ మద్దతు ఇవ్వలేదు. గెలిచిన తర్వాత రాష్ట్రపతి భవన్ కు వెళ్లి శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. బీజేపీతో ఉన్న తీవ్ర విభేదాలే దీనికి కారణం అని చెప్పాల్సిన పని లేదు. అందుకే రాష్ట్రపతి తెలంగాణ పర్యటన ఖరారైన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారని.. ఐదు రోజుల పాటు అక్కడే ఉంటారన్న ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ ఢిల్లీ వెళ్లలేదు. తెలంగాణలోనే ఉన్నారు. అదే సమయంలో రాష్ట్రపతికి స్వాగతం చెప్పాలని నిర్ణయించుకున్నారు.
కానీ.. తర్వాత రాజ్ భవన్ లో జరిగే విందుకు మాత్రం ఆయన డుమ్మాకొట్టారు. హకీంపేట నుంచి ఆయన నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారని అంటున్నారు. ఆయన రాష్ట్రపతికి స్వాగతం చెబుతున్న కార్యక్రమంలో ఉండగానే.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి ఇస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా ఆయన ముభావంగా ఉండిపోయారని.. విందుకు కూడా డుమ్మా కొట్టారని భావిస్తున్నారు. సాధారణంగా రాష్ట్రపతి గౌరవార్థం ఇచ్చే విందులకు .. సీఎం స్థాయి నేతలు ఎవరూ డుమ్మాకొట్టరు.