టీడీపీ పొత్తు ప్రణాళికల్ని చిత్తు చేయడానికి వైసీపీ అధినేత జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో అది కూడా ఓ ఎజెండా అని చెబుతున్నారు. అదేమిటంటే.. బీజేపీ.. టీడీపీ వైపు వెళ్లకుండా ఆపడం. అందు కోసం కొన్ని నిర్దిష్టమైన ప్రణాళికలను బీజేపీ హైకమాండ్ ముందు జగన్ పెడతారని అంటున్నారు. అందులో కీలకమైనది…. బీజేపీతో వైసీపీ పొత్తు అంటున్నారు.
బీజేపీ.. టీడీపీకి దగ్గర కాకుండా వైసీపీ మాస్టర్ ప్లాన్
ప్రస్తుతం ఏపీలో పొత్తులపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఖమ్మంలో సభ పెట్టడానికి కారణం బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు తమ బలం ఎంతో ప్రదర్శన చేయడమేనని బీఆర్ఎస్ నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అదే చెప్పారు. టీడీపీ సానుభూతిపరులు కూడా అదే చెబుతున్నారు. తెలంగాణ సంగతేమో కానీ ఏపీలో బీజేపీకి ఒక్క శాతం ఓటు బ్యాంక్ లేదు. కానీ ఎన్నికలు సజావుగా జరుగుతాయని ఎవరూ అనుకోవడం లేదు. ఇప్పుడే అరాచకం రాజ్యమేలుతోంది. వీటిని కంట్రోల్ చేయాలంటే.. బీజేపీ సపోర్ట్ కావాలి. అందుకే పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు.
పార్లమెంట్ స్థానాలిచ్చేలా పొత్తులకు ఒప్పించే ప్రయత్నాలు ?
జనసేన పార్టీ ఇప్పటికే పరోక్షంగా అయినా క్లారిటీ ఇచ్చింది. వైసీపీ ముక్త ఏపీ కోసం .. టీడీపీతో వెళ్తున్నట్లుగా చెప్పకనే చెబుతున్నారు. ఇప్పుడు ఎటూ మొగ్గకపోయినా.. ఎన్నికల సమయానికి బీజేపీ టీడీపీ వైపు వెళ్తుందని ఎక్కువ మంది భావిస్తున్నారు. తెలంగాణలో బలాన్ని కూడా చంద్రబాబు దీనికే చూపిస్తున్నారంటున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ.. టీడీపీ వైపు వెళ్లకుండా తమతోనే ఉండేలా చూసుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. అధికారికంగా పొత్తు పెట్టుకుంటామని.. అసెంబ్లీ స్థానాలు గొప్పగా ఇవ్వకపోయినా పార్లమెంట్ స్థానాలు ఇస్తామని ప్రతిపాదన పెట్టనున్నట్లుగా చెబుతున్నారు.
బీజేపీ హైకమాండ్ ఆలోచనలను బట్టే ?
ఎన్డీఏలో పార్టీల సంఖ్య తగ్గిపోయింది. పరోక్ష సహకారాల కన్నా.. కూటమిలో చేరడానికి ఆసక్తి కనబర్చే పార్టీలకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే వైసీపీ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. జగన్ ఢిల్లీ పర్యటనలోబీజేపీ మెచ్చేలా రాజకీయ ప్రతిపాదనలు ఖచ్చితంగా ఉంటాయని…. అవి తమ ఇబ్బందులు తీర్చేలా ఉంటాయని వైసీపీ పెద్దలు తమ క్యాడర్ కు సందేశం ఇస్తున్నారు. ఒక వేళ బీజేపీ గనుక .. రెడీ అంటే కొత్త పొత్తులు పొడిచే చాన్స్ ఉందనుకోవచ్చు.