ఇప్పటికి ఏపీలో అధికారిక పొత్తులు ఖరారు కాలేదు కానీ.. పరోక్షంగా టీడీపీ, జనసేన రాజకీయాలు చూస్తున్న వారికి… ఇప్పటికే అవగాహన వచ్చేసిందా అనే అనుమానం రాక మానదు. జనసేన పార్టీకి తెనాలి, సత్తెనపల్లి నియోజకవర్గాలు కేటాయించారన్నట్లుగా అక్కడ వ్యవహారాలు సాగుతున్నాయి. తెనాలిలో టీడీపీ జోరు తగ్గించింది. ఇటీవల మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెనాలి సీటు చంద్రబాబు తనకేమీ రాసివ్వలేదని వ్యాఖ్యానించడం ప్రారంభించారు. జనసేన అధినేత ఇటీవల సత్తెనపల్లిపై ప్రత్యేక గురి పెట్టి ప్రచారం చేస్తున్నారు. రైతు భరోసా యాత్ర అక్కడే నిర్వహించారు.
ఈ పరిణామాలు చూసిన వారికి అంతర్గతంగా టీడీపీ,జనసేన నేతలు ఖచ్చితంగా ఓకే అనుకున్న సీట్ల విషయంలో రాజీ పడుతున్నారని భావిస్తున్నారు. పొత్తుల అంశం పై ఇరు పార్టీల నేతలు మాత్రం క్లారిటి లేదని చెప్పుకొస్తున్నారు. కానీ జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకలాపాలను తగ్గించుకుంటూడటంతో అంతా వ్యూహాత్మకంగా జరుగుతోందని అంటున్నారు. జనసేన పార్టీతో పొత్తుల అంశం పై టీడీపీలో చర్చ జరుగుతున్నందున తెనాలి సీటు కోసం నాదెండ్ల రెడీ గా ఉన్నారు. ఆయన తెనాలి నుండి పోటీ చేయాలంటే, పొత్తులో భాగంగా, టీడీపీ ఆ సీటును వదలుకోవాల్సిందే.
రాజకీయంగా ఇప్పటికే జనసేన, టీడీపీ కలసి పోటీ చేయటం పై ఇరు పార్టీలకు చెందిన నేతలు అండర్ స్టాండింగ్ కు వస్తున్నారని చెబుతున్నారు. దీంతో జనసేనలో పవన్ తరువాత నెంబర్ టూలో ఉన్న నాదెండ్ల మనోహర్ పోటీ చేసేందుకు తెనాలి మాత్రమే ఆప్షన్. దీంతో ఇప్పటి నుండి టీడీపీ శ్రేణులకు ఈ విషయం పై క్లారిటి ఉంటే ఎన్నికల నాటికి ఫలితాలు అనుకూలంగా ఉంటాయని ఆలపాటి అభిప్రాయంగా చెబుతున్నారు.