ధమాకా సినిమాలో ఓ ఊపు ఊపేసిన పాట.. `పల్సర్ బైకు`. సందర్భానికి తగిందా? కాదా? అసలు ఈ సినిమాలో ఈ పాట అవసరమా? అనేది పక్కన పెడితే.. థియేటర్ మొత్తానికి ఓ ఊపు తీసుకొచ్చింది ఈ పాట. పల్సర్ బైక్.. ఓ ప్రైవేటు గీతం. ఇప్పటికే యూ ట్యూబ్, శ్రీదేవి డ్రామా కంపెనీల ద్వారా ఈ పాట చాలా పాపులర్ అయిపోయింది. ‘ఒరేయ్ గాజువాక కండెక్టర్ పాటేయండ్రోయ్’ అని సినిమాలో రవితేజ అనగానే.. ఈ పాట ప్లే అవుతుంది. నిజానికి ఈ పాటకు కర్త, కర్మ, క్రియ… రమణ అనే కుర్రాడు. గాజువాకలో కండెక్టర్ గా పనిచేసే ఝాన్సీ అనే అమ్మాయి…ఈపాటకు శ్రీదేవి డ్రామా కంపెనీలో స్టెప్పులువేసింది. అప్పటి నుంచీ ఈ పాట మరింత పాపులర్ అయిపోయింది. ధమాకాలో.. వచ్చిన దగ్గర్నుంచి ఈ పాటకు మరింత ప్రాచుర్యం లభించింది. కాకపోతే.. ధమాకా టీమ్ మాత్రం ఈ పాట క్రెడిట్ మొత్తం `గాజువాక కండెక్టర్`కే కట్టబెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ‘గాజువాక ఝాన్సీ’ ఈ పాటకు స్టెప్పులేసిందంతే. దాంతో.. ఈ పాట రాసి, పాడిన రమణ ఫీలవుతున్నట్టు టాక్. `పల్సర్ బైక్` పాట వేయండ్రోయ్… అనాల్సిన చోట, గాజువాక కండెక్టర్ పేరు తేవడం.. ఓ క్రియేటర్ కష్టాన్ని తక్కువ చేయడమే. కాకపోతే.. ‘ధమాకా’ టీమ్ మాత్రం రమణకు మంచి మొత్తాన్నే కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఆర్థికంగా ఓకే అనిపించినా.. క్రెడిట్ విషయంలో అన్యాయం జరగడంతో… రమణ బాధ పడుతున్నాడిప్పుడు. మైనస్ లోనూ ప్లస్ ఏమిటంటే.. ‘ధమాకా’ వచ్చాక.. ‘పల్సర్ బైక్’ పాటకు మరిన్ని వ్యూస్ వచ్చాయి.