ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు.. వైఎస్ జగన్ ఫ్యామిలీకి ఏదో విధంగా మేలు చేయకపోతే వారు అసలు పదవుల్లోనే ఉండరన్నట్లుగా పరిస్థితి ఉంది. తాజాగా చిలుకలూరిపేట నుంచి గెలిచి తొలి సారి మాంత్రి అయిన విడదల రజనీ కూడా తన నియోజకవర్గంలో కడపపకు చెందిన ప్రముఖ మైనింగ్ వ్యాపారులు ఇంకా చెప్పాలంటే.. సీఎం జగన్ దగ్గర బంధువులు మైనింగ్ చేసుకోవడానికి అడ్డదారుల్లో అవకాశాలు ఇప్పించి అడ్డంగా దొరికిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైకోర్టులో అక్రమ మైనింగ్ పై పిటిషన్లు దాఖలు కావడంతో విడదల రజనీకి.. అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
గ్రానైట్ తవ్వకాల్లో ఎన్వోసీ జారీ అంశంలో విడదల రజినికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలోనే కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన మామ ప్రతాప్‌రెడ్డికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. మొరకపూడిలోని 91 ఎకరాల అసైన్డ్ భూమిలో తవ్వకాలకు అనుమతించడంలో మంత్రి విడదల రజిని హస్తం ఉందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు వివరణ ఇవ్వాలని మంత్రి విడదల రజినితో పాటు లోకల్ తహసీల్దార్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను 3 వారాల పాటు వాయిదా వేసింది.
ఏపీలో ఏ జిల్లాలో చూసినా గనులన్నీ వైఎస్ బంధువుల చేతుల్లోనే ఉంటున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇసుకను కూడా కడప కాంట్రాక్టర్లే నియంత్రిస్తున్నారు. మైనింగ్ అనే మాట వింటే.. కడప వాళ్లే ఉంటున్నారు. ఎక్కడైనా వివాదాలుంటే.. బినామీల ద్వారా పనులు చక్క బెడుతున్నారు. ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారు.. ఇతర పదవుల్లో ఉన్న వారు వారికి సహకరించాల్సి వస్తోంది. దీంతో వారూ నిందితులు అవుతున్నారు.