తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పం టు ఇచ్చాపురం పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. జనవరి 27న ప్రారంభం కానున్న పాదయాత్రకు యువగళం అని పేరు పెట్టారు. లోకేష్ చేపట్టే పాదయాత్ర నాలుగు వందల రోజుల పాటు సాగనుంది. షెడ్యుల్ ప్రకారం ఎన్నికలు జరిగితే అప్పటి వరకు యాత్ర కొనసాగుతుంది. 400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు సాగనుంది లోకేశ్ పాదయాత్ర.
వంద నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. లోకేష్ తన పాదయాత్రలో యువత, మహిళలు, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలతో సమావేశం కానున్నారు. వారి సమస్యలు తెలుసుకోవడంతోపాటు వారి పరిష్కార మార్గాలను సూచించనున్నారు. లోకేష్ పాదయాత్ర వివరాలను అచ్చెన్నాయుడు నేతృత్వంలోని సీనియర్ నేతలు అమరావతిలో ప్రకటించారు. లోగో ఆవిష్కరించారు.
లోకేష్ పాదయాత్ర చేస్తారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది . 2023 జనవరి 27న లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేష్ పాదయాత్ర సాగనుంది. దీనికి తగ్గట్టుగానే రూట్ మ్యాప్ సిద్ధమైంది. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళిక రూపొందించనున్నారు. యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ పాదయాత్ర ముందుకు సాగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే యువగళం అని పేరు పెట్టారు.