ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈడీ విచారణ ప్రారంభించడాన్ని రోహిత్ రెడ్డి అంగీకరించడం లేదు. చట్ట విరుద్ధంగా విచారణ చేస్తున్నారని ఆయన హైకోర్టుకు వెళ్లారు. ఆయన తరపున వాదించడానికి నిరంజన్ రెడ్డిని పెట్టుకున్నారు. ఈయన జగన్ అక్రమాస్తుల కేసుల్లో వాదించే లాయర్ మాత్రమే కాదు….వైసీపీ ఎంపీ కూడా. ఆయననే రోహిత్ రెడ్డి పెట్టుకున్నారు. ఇటీవలి కాలంలో నిరంజన్ రెడ్డి.. టీఆర్ఎస్ నేతలకు కూడా లాయర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే రోహిత్ రెడ్డికి ఆయన ఊరట కల్పించలేకపోకపోయారు. ఈడీ విచారణను నిలిపివేసేలా ఉత్తర్వలిచ్చేంత ధాటిగా ఆయన వాదనలు వినిపించలేకపోయారు.
ఈడీ విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రోహిత్ రెడ్డి తరపు లాయర్ నిరంజన్ రెడ్డి అభ్యర్థన ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈనెల 30న హాజరు కావాలన్న ఈడీ సమన్లలో జోక్యానికి నిరాకరించింది. పార్టీ మారాలని తనకు వందకోట్లు ఆఫర్ ఇచ్చారు లకానీ.. డబ్బు ఇవ్వలేదని… ఆర్థిక లావాదేవీలు జరగలేదు కనుక ఈడీకి విచారణ పరిధి లేదని నిరంజన్ రెడ్డి వాదించారు. ఈడీ ఈసీఐఆర్ మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధమని వాదించారు. కానీ కోర్టు అంగీకరించలేదు.
హైకోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో.. రోహిత్ రెడ్డి 30వ తేదీన ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ ఈడీ నందకుమార్ ను రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని కొన్నికీలక వివరాలు సేకరించింది. ఇప్పుడ రోహిత్ రెడ్డిని విచారణకు పిలుస్తోంది. దీంతో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.