ఈ నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు అడుగుతారు? అని తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. అయితే ఇది రొటీన్.. కానీ ఇదే ప్రశ్నను వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు వేస్తే అందులో కిక్ వేరుగా ఉంటుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి జగన్ కు పరోక్షంగా ఈ సూటి ప్రశ్నలే వేశారు. తన నియోజకవర్గంలో వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్ల సమావేశంలో తనలోని ఆవేదన అంతా బయట పెట్టుకున్నరాు.
పెన్షన్లు ఇస్తున్నామంటున్నారని.. పెన్షన్లు ఇచ్చేస్తే ఓట్లు వేస్తారా అని ప్రశ్నించారు. పెన్షన్లు గత ప్రభుత్వం కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. నాలుగేళ్లలో కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేకపోతున్నామన్నారు. ఏం పనిచేశామని ప్రజలను ఓట్లు అడగాలని ప్రశ్నించారు. ప్రాజెక్టులు ఏమైనా కట్టామా ? పోనీ పనులు చేశామా..? కనీసం శంకుస్థాపనలు ఏమైనా చేశామని అని ఆయన నేరుగా మండిపడ్డారు.
ఆనం ధిక్కారం ఇదేమొదటి సారి కాదు. కానీ డైరక్ట్ ధిక్కారం మాత్రం ఇదే మొదటి సారి. గతంలో ఓ సారి ఆయనను సస్పెండ్ చేస్తారన్నంత హడావుడి చేశారు. కానీ ఏమీ చేయలేదు. ఇప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూడా రెబల్ గానే ఉన్నారు. ఆయన కూడా ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో నెల్లూరు ఎమ్మెల్యేల తీరు వైసీపీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.