దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యధిక ధనవంతులెవరు ? దేశంలోని సీఎంలలో ఎక్కువ ఎవరిపైనా కేసులున్నాయి ? అనే రెండు ప్రశ్నలకు సమాధానంగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల పేర్లు వస్తున్నాయి. సీఎం జగన్ అత్యంత ధనవంతుడైన సీఎంగా రికార్డు సృష్టిచారు. రాజకీయాల్లోకి రాక ముందు సండూర్ పవర్ అనే కంపెనీ పెట్టడానికి పెద్ద ఎత్తున అప్పులు చేసిన ఆయన ఇప్పుడు…. ఆదాయపు పన్ను ఆస్తుల్లో వందల కోట్లకు ఎదిగారు.
సీఎంల గత ఎన్నికల అఫిడవిట్లను సేకరించి ఓ జాతీయ మీడియా సంస్థ ఈ వివరాలు ప్రకటించింది. అత్యంత ధనవంతుడిగా ఏపీ సీఎం మొదటిస్థానంలో ఉంటే చివరన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. జగన్ రూ.370 కోట్ల ఆస్తితో 30మంది సీఎంలలో మొదటి స్థానంలో ఉన్నారు. మమతా బెనర్జీ ఆస్తి కేవలం రూ.15లక్షలు కాగా.. బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఆస్తి రూ.56 లక్షలు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రూ.73 లక్షల ఆస్తులు కలిగి ఉన్నారు.
అందరి కంటే ఎక్కువగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై 64 కేసులు ఉంటే, ఆ తర్వాత తమిళనాడు సీఎం స్టాలిన్‌పై 47 కేసులు, సీఎం జగన్‌పై 38 కేసులు ఉన్నాయి. నేరారోపణ కేసులు కేసీఆర్, జగన్ ఇద్దరిపైనా ఉన్నాయి. అలర్లు, హత్యాయత్నం కేసుల్లో కేసీఆర్, చీటింగ్ కేసుల్లో జగన్, కిడ్నాప్ కేసులో స్టాలిన్ ఉన్నారు. 10మంది బీజేపీ సీఎంలలో ఒక్కరిపైనా ఒక్క కేసు కూడా లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పై నమోదైన కేసుల వల్లే ఆయన మొదటి స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం అత్యంత తీవ్రమైన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.