టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించిన సీఎం జగన్ ఇప్పుడు వాటిని పునరుద్ధరించాల్సిందేనన్న ఒత్తిడి పెరుగుతోంది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు.. ఆ తర్వాత పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన క్లారిటీ ప్రకారం… ఆ రిజర్వేషన్లు చెల్లుతాయి. సర్టిఫికెట్లు జారీ చేయడమే మిగిలింది. దీనిపై కాపు వర్గాల్లో ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతోంది. కాపు సంఘాలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా.. జనసేన పార్టీ సీనియర్ నేత చేగొండి హరిరామ జోగయ్య … ఆమరణదీక్ష హెచ్చరిక చేశారు.
అగ్రవర్ణాల్లో వీకర్స్ సెక్షన్ కింద కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని జోగయ్యకోరుతున్నారు. కాపులకు రిజర్వేషన్ అంశంపై డిసెంబర్ 30వ తేదీలోపు ఉత్తర్వులు జారీ చేయాలని హరిరామ జోగయ్య డెడ్ లైన్ విధించారు. లేకపోతే జనవరి 2 నుంచి నిరహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. మూడేళ్లలో సీఎం జగన్ కాపులకు అన్యాయం చేశారని జోగయ్య ఆరోపించారు.
ముద్రగడ పద్మనాభం కూడా ఇటీవల సీఎం జగన్ కు ఇటీవల లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఈ డబ్ల్యూ ఎస్ పై ఇచ్చిన తీర్పు, రిజర్వేషన్లు రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానం పై దృష్టి పెట్టాలని లేఖలో ముద్రగడ విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లపై పరిశీలన చేయాలన్నారు. అందరూ అనుభవించగా మిగిలిన దానిలో తమ రిజర్వేషన్లు ఇప్పించాలని కోరారు. అయితే ముద్రగడ జగన్ ను బతిమాలుకున్నట్లుగా లేఖ రాశారు. దీంతో ఆయనపై కాపుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కాపు రిజర్వేషన్ల అంశం.. ముందు ముందు మరింత హైలెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కీలక పరిణామాలు రాజకీయంగా చోటు చేసుకోనున్నాయని భావిస్తున్నారు.