ఈ సంక్రాంతికి బాక్సాఫీసు ముందుకు రాబోతున్న సినిమాల్లో ‘వీర సింహారెడ్డి’ ఒకటి. ఇప్పటి వరకూ వచ్చిన పాటలూ, టీజర్లు, పోస్టర్లు చూసి ఇదో మాస్ సినిమా అని ఫిక్సయిపోయారు జనాలు. పైకి అలానే కనిపిస్తున్నా.. లోపల మాత్రం సెంటిమెంట్ గట్టిగా దట్టించారని టాక్. ముఖ్యంగా వరలక్ష్మీ శరత్ కుమార్, బాలయ్య మధ్య వచ్చే సెంటింమెంట్ సీన్లు కంటితడి పెట్టించేలా ఉన్నాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అఖండ ఎంత మాస్ సినిమా అయినా… అందులోనూ ఎమోషన్ని గట్టిగా దట్టించాడు బోయపాటి. సేమ్ అదే ఫార్మెట్లో ఈ కథ సాగబోతోందని తెలుస్తోంది. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. వాళ్లని మెప్పించేలా… కొన్ని ఎపిసోడ్లని రూపొందించారని, బాలయ్య తరవాత ఈ సినిమాలో అంతటి వెయిటేజ్ ఉన్న పాత్ర వరలక్ష్మీ శరత్ కుమార్ దని సమాచారం. అయితే… వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రలో ఓ ట్విస్టు రాబోతోంది. ఆ ట్విస్ట్ ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారో అనే కొద్దిపాటి టెన్షన్ చిత్ర బృందంలో ఉంది. మరోవైపు… ఈ సినిమాకి పోటీగా దిగుతున్న ‘వాల్తేరు వీరయ్య’ పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా రూపుదిద్దుకొంది. ముఖ్యంగా సెకండాఫ్లో చిరు, రవితేజ మధ్య వచ్చే సీన్లు ఓ లెవిల్లో ఉన్నాయట. ‘వాల్తేరు వీరయ్య’ థీమ్ సాంగ్, పూనకాలు పాటకు థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే రెండు సినిమాల్లోనూ కావల్సినంత స్టఫ్ కనిపిస్తోంది. ఈసారి సంక్రాంతి పండగ సంబరాలు డబుల్ అయ్యే అవకాశాలే ఎక్కువ.