“రాజకీయం బ్రహ్మరాక్షసి” అందులో సందేహం లేదు. అంత మాత్రాన రాజకీయ నాయకులు అందరూ బ్రహ్మరాక్షసులు అవ్వాలని లేదు. మనుషులుగా ఉండవచ్చు. కనీసం అప్పుడప్పుడయినా మనుషులుగా ప్రవర్తిస్తే.. రాజకీయం అనే పదానికి కాస్త మానవత్వం ఉంటుందని.. ఎప్పటికైనా కొంత మంది నమ్ముతారు. లేకపోతే రాజకీయ నేతలు అంటనే భయపడే పరిస్థితి వస్తుంది. ఇదంతా ఎందుకంటే.. నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై జరుగుతున్న రాజకీయం గురించే. జరిగింది ఘోర విషాదం. ఎనిమది మంది అమాయకుల ప్రాణాలు పోయాయి. ప్రతి ఒక్కరి హృదయం ద్రవించింది. ఆ కుటుంబాల గురించి అందరికీ ఆలోచన వచ్చింది. టీడీపీ పార్టీ ర్యాలీకి వచ్చినందున ఈ ఘటనకు బాధ్యత టీడీపీనే తీసుకోవాలి. తీసుకుంటామని చంద్రబాబు కూడా ప్రకటించారు. ప్రసంగం ఆపేసి వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. విషయాలు తెలుసుకున్నారు. మళ్లీ వచ్చారు.. తన మీటింగ్ కోసం వచ్చిన వారికి జరిగినదంతా చెప్పారు. ప్రాణాలూ ఎలాగూ రావు.. వారి కుటుంబాల ప్రాణాలను నిలబెట్టాల్సిన బాధ్యత తమపైనే ఉందని చంద్రబాబు ప్రకటించారు. అప్పటికప్పుడు ఆర్థిక సాయం ప్రకటించారు. కుటుంబ సభ్యులను పిలిపించి ధైర్యం చెప్పారు. ప్రతీ విషయంలోనూ అండగా ఉంటామన్నారు. రూ. పాతిక లక్షల వరకూ ఒక్కో కుటుంబానికి సాయం గంటల్లోనే అందేలా చూసుకున్నారు. పిల్లల చదువులు..ఇతర సమస్యలు ఏమైనా ఉంటే.. టీడీపీనే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి ప్రాణాలను తీసుకు రాలేను కానీ..వారు ఉంటే.. కుటుంబాన్ని ఎంత భద్రంగా చూసుకునేవారు.. అంత భద్రంగా టీడీపీ చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి స్పందన ఆ కుటుంబాల్లో కాస్తంత స్వాంత్వన కనిపించింది. చాలా మందికి టీడీపీ అధినేత రెస్పాన్స్ సంతృప్తిని కలిగించింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీల నేతలూ స్పందించారు . అందరి స్పందన మానవత్వంతోనే ఉన్నాయి. చావుల్ని ఎవరూ కించపర్చలేదు. కానీ ఏపీ అధికార పార్టీ నేతలకు మాత్రం.. ఇంతకు మించిన సందర్భం మరొకటి దొరకదనుకున్నారేమో కానీ.. . రెచ్చిపోయారు. తాము మనుషులమేనన్న సంగతి ఇతరులు కూడా మర్చిపోయేంత దారుణమైన ప్రకటనలు చేశారు. వైసీపీ నేతల మాటలు వింటే.. ఎవరికైనా… రాజకీయం అంటే ఇంత ఘోరంగా ఉండాలా అని అనిపించకమానదు.
మానవత్వం లేకుండా శవ రాజకీయాలు !
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా.. అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం అని కూడా మర్చిపోయారు. నిజానికి ఆమె వారానికోసారి శ్రీవారి వీఐపీ దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత రాజకీయ విమర్శలు గుడి ఎదుటే చేస్తూంటారు. అక్కడ మాట్లాడితే మీడియాలో మంచి కవరేజీ వస్తుందని ఆమె ఉద్దేశం కావొచ్చు.. ఈ సారి కూడా అదే చేశారు. పవిత్రమైన దేవుడి సన్నిధిలో అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నామని ఆమె అనుకోలేదు. చావులతో రాజకీయం చేసేశారు. చంద్రబాబు చేసిన హత్యలన్నారు. ఇంకా చెప్పలేనంత.. ప్రస్తావించలేనంత దారుణంగా మాట్లాడారు. ఒక్క రోజా కాదు.. ఉదయం నుంచి వైసీపీ నేతలంతా ఇలా చంద్రబాబు చేసిన హత్యలంటూ వీడియోలు విడుదల చేస్తూనే ఉన్నారు. చివరికి ప్రభుత్వం కూడా సీక్రెట్‌గా కేసు కూడా పెట్టేసింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిచ్చయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో సహజంగానే చంద్రబాబు ఏ వన్ గా ఉంటారు. ఎందుకంటే.. అందరి టార్గెట్ చంద్రబాబు. రాష్ట్రంలో..దేశంలో.. ఎక్కడ ఏం జరిగినా.. చంద్రబాబేనని వైసీపీ నేతలు చెబుతూంటారు. కందుకూరు ఘటనపై మాత్రం చంద్రబాబుది కాదని ఎందుకంటారు ? . అనొచ్చు.. అది రాజకీయం అని అనుకుంటే అనొచ్చు.. కానీ శవాలను అడ్డం పెట్టుకుని ఇలా కురూపీ రాజకీయం చేసి ఏం సాధిస్తారనేది ఎవరి ఊహకు అందరని విషయం. అక్కడ తప్పు ఎక్కడ జరిగింది ? ఎలా జరిగింది ? అనే విశ్లేషణ ప్రభుత్వ పరంగా కనీసం జరగలేదు. పాలకులు చేయాల్సింంది చేయలేదు. కానీ.. తప్పు జరగగానే.. ఆ మీటింగ్ పెట్టుకున్న వారిని అత్యంత అసభ్యంగా నిందించడం ప్రారంభించారు.
జగన్ సభలు పెట్టింది కూడా అక్కడే కదా… ఎందుకు చెప్పరు ?
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో సందు గొందుల్లో రోడ్ షో నిర్వహించారని వైసీపీ నేతల ఆరోపణ. నిజానికి అది కందుకూరులోని మెయిన్ రోడ్ సెంటర్. ఆస్పత్రులు ఉండే సెంటర్. ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేసినప్పుడు అక్కడే రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలోనూ అక్కడే రోడ్ షో నిర్వహించారు. ఎవరు వచ్చినా అక్కడే నిర్వహిస్తారు. ఆ విషయం వైసీపీ నేతలకు తెలియనిదేం కాదు.. కానీ ఇటీవలి కాలంలో చంద్రబాబు సభలకు వస్తున్న జనాల దృశ్యాలు నిజం కాదని.. సందు గొందుల్లో పెట్టి దృశ్యాలు టీవీల్లో చూపిస్తున్నారని చెప్పుకోవడానికి వారికి కందుకూరు దుర్ఘటన రూపంలో ఓ అవకాశం దొరికింది. అంతే… దొరికింది కదా అని ఇష్టారీతిన మాట్లాడటం ప్రారంభించారు. నిజానికి అంత మంది జనం వస్తారని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఊహించలేకపోయారు. ఒక్క సారిగా ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత పరిస్థితి చూసి చంద్రబాబు కూడా ఆందోళన చెందారు. పక్కనే కాలువ ఉందని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు కూడా చేశారు. అయినా రెండు అంటే రెండు నిమిషాల్లో దుర్ఘటన జరిగిపోయింది. టీడీపీ నేతలు కూడా ముందుగా ఈ విషయాన్ని గుర్తించాల్సి ఉంది. రాజకీయపార్టీ బహిరంగసభ నిర్వహించే ప్రదేశం, అక్కడి పరిస్థితులు రద్దీని తట్టుకునేలా ఉండాలి. పార్టీపరంగా దానికి తగ్గ ఏర్పాట్లు జరగాల్సి ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు కానీ… అధికార యంత్రాంగం కానీ.. ప్రజలు కాలువ పక్కన నిలబడితే ప్రమాదం జరుగుతుందని ముందే ఊహించి అక్కడ అడ్డుగా బ్యారికేడ్లనో, కర్రలతో అడ్డుగా కట్టే ప్రయత్నం చేయలేదు. అధికార యంత్రాంగం పర్యవేక్షణాలోపం ఉన్నా అధినేత వచ్చినప్పుడు పార్టీ యంత్రాంగం కాస్త ముందు జాగ్రత్తచర్యలు చేపట్టి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు!
ప్రతిపక్ష నేతల సభలకు వచ్చే జనాలు మనుషులు కాదని ప్రభుత్వ భావనా?
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఎంత కురూపీగా మారిందంటే… ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలు లేదా ప్రచారాలు చేసుకోవడం నేరం అన్నంతగా మారిపోయింది. గతంలో విపక్ష నేత ఏదైనా ప్రాంతానికి వెళ్తున్నారంటే అక్కడకు వచ్చే జనంను బట్టి ప్రభుత్వం యంత్రాంగం జాగర్తలు తీసుకునేది. పార్టీ పరంగా ఏర్పాట్లు చేసుకునేవారు కానీ.. బందోబస్తు కానీ.. ఆ మార్గంలో ప్రమాదకర పరిస్థితులు ఉంటే.. వాటిని సరి చేయడం వంటివి చేసేవారు. అయితే ఈ ప్రభుత్వంలో విపక్ష నేతలకు ఎక్కడికైనా వెళ్లాలంటే పర్మిషన్లు కూడా రావు.. ఇక బందోబస్తులు.. జాగ్రత్తలా.? ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటిస్తూంటే.. భారీగా జనం తరలి వస్తారని తెలిసి కూడా అధికారయంత్రాంగం కనీస చర్యలు తీసుకోలేదు. ఘటన జరిగినప్పుడు కూడా ఎవరూ లేరు. టీడీపీ కార్యకర్తలే ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అయినా ఆ తర్వాత రాజకీయ ఆరోపణలు ప్రారంభించారు. చివరికి అందరికీ సలహాదారు అయిన సజ్జల రామకష్ణారెడ్డి కూడా.. ఇరుకు సందుల్లో సభ పెట్టారని.. తమ తప్పేం లేదని చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. చంద్రబాబులో అహంకారం ఉందని ఆయన వాదించారు. చంద్రబాబులో అహంకారం ఉందో లేదో కానీ… జరిగిన తప్పిదంపై రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నాలు చేయడానికి.. చనిపోయిన వారి మృతదేహాలతో రాజకీయం చేయడానికి ఏ మాత్రం వెనుకాడబోమని వైసీపీ నేతలు చెప్పకనే చెప్పినట్లయింది. నిజానికి ఇలాంటి ఘటన జరిగితే సీఎం పొజిషన్లో ఎవరు ఉన్నా… వెంటనే పరిస్థితి చక్కదిద్దేలా జాగ్రత్తలు తీసుకునేవారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఆదేశాలు జారీ చేసేవారు. కానీ.. ఇక్కడ వాళ్లంతా టీడీపీ కార్యకర్తలు కాబట్టి పట్టించుకోవాల్సిన పని లేదన్నట్లుగా వారి తీరు ఉండటం.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రధాని మోదీ… గవర్నర్ హరిచందన్ స్పందించిన తర్వాత.. స్వరాష్ట్ర ప్రజలు చనిపోతే..పార్టీలు చూసుకుని జగన్ స్పందించలేదని నిందిస్తారన్నకారణం ఎప్పటికో స్పందించారు. ఇలాంటి ప్రమాదాల్లో చనిపోయిన వారికి ఇచ్చే రూ. రెండు లక్షల పరిహారం ప్రకటించారు. ఆయన పార్టీ నేతలు మాత్రం కురూపీ రాజకీయం చేస్తూనే ఉన్నారు.
వైసీబీ సభల్లోనూ జనం చనిపోయారు..వారిని కనీసం ఆదుకున్నారా?
ప్రమాదాలు చెప్పి రావు. ఒక్క పార్టీ సభల్లోనే జరగవు. కానీ అలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మానవత్వంతో వ్యవహిరంచడం కీలకం. జగన్ పాదయాత్ర చేశారు. చాలా చోట్ల సభలు నిర్వహించారు. ఆయన పాదయాత్ర కాలంలో ఎనిమిది మంది తొక్కిసలాటల్లో చనిపోయారు. పాదయాత్ర ప్రారంభం రోజునే ఒకరు ఇడుపులపాయలో చనిపోయారు. ఇక సీఎం అయిన తర్వాత డ్వాక్రా మహిళల్నితీసుకొచ్చి నిర్వహిస్తున్న సభల్లోనూ మరణాలు చోటు చేసుకున్నాయి. ఇక గోదావరి జిల్లాలో నిర్వహించిన సభలో ఓ వృద్ధురాలు తొక్కిసలాటలో చనిపోయారు. ఇద్దరు పోలీసు అధికారులు గుండెపోటుతో చనిపోయారు. పార్టీ ప్లీనరీ నాగార్జున యూనివర్శిటీ ఎదుట నిర్వహిస్తున్నప్పుడు.. ఓ వాలంటీర్ ను బస్సు గుద్ది చంపేసింది. జయహో బీసీ సదస్సులో భోజనాల దగ్గర ఓ బీసీ ప్రజాప్రతినిధి తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. నాలుగైదు రోజుల చికిత్స తర్వాత చనిపోయారు. జనసేన పార్టీ కార్యక్రమాల్లోనూ ఇలాగే చనిపోయారు. పెద్దఎత్తున వచ్చే జనాన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు.. కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి. జరిగిపోతే.. మానవత్వం అన్నా ప్రదర్శించారు. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలకు… టీడీపీ అండగా ఉంది. ఆ కుటుంబాలను టీడీపీ దత్తత తీసుకుంది. కానీ జగన్ పాదయాత్రలో చనిపోయిన వారికి వైసీపీ అండగా ఉందా? . ప్లీనరీకి వచ్చి బస్సు ప్రమాదంలో చనిపోయిన వాలంటీర్ ను కనీసం పట్టించుకున్నారా..? ఇవన్నీ.. ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్న రాజకీయ పార్టీల నేతలు ఆలోచించాల్సి ఉంది. తాము చేసిందేమిటి.. తాము ఇప్పుడు అనుభవిస్తున్న పదవులు అలాంటి వారు పల్లకీలు మోయడం వల్లే వచ్చాయనే సంగతిని మర్చిపోయిన వారికి.. ఇలాంటి శవ రాజకీయాలు చేయడం పెద్ద విషయం కాదు. కానీ ఎదుటి వారి మరణాన్ని కూడా తమ రాజకీయ ఆకాంక్షలు నేరవేర్చుకోవడానికి ప్రత్యర్థి పార్టీ నేతల మీద నిందలు వేయడానికి వాడుకుంటే.. అంతకు మించిన దిగజారుడు రాజకీయం ఉండదు.
శవ రాజకీయాలతో ప్రజలకు అసహ్యం వేస్తుంది కానీ.. వ్యతిరేకత పెంచలేరు.. సానుభూతి రాదు !
ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నా అదే రాజకీయం. హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినా అదే రాజకీయం. టీడీపీ కార్యక్రమ్ంలో విషాదం చోటు చేసుకున్నా అదే రాజకీయం. రాజకీయ విమర్శలు పద్దతిగా ఉండాలి.. కానీ.. గీత దాటిపోకూడదు. అలా పోతే.. ప్రజలకు కూడా అసహ్యం వేస్తుంది. అది వ్యక్తులపై కంటే.. రాజకీయ. వ్యవస్థపైనే ఆ అసహ్యం ఎక్కువగా వేస్తుంది. అదే జరిగితే.. రాజకీయ నేతలు కూడా విలువ కోల్పోయారు. రాజకీయం అనేదానికి రాక్షసత్వం కరెక్ట్ పదంగా మిగిలిపోతుంది.