విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్ పెట్టడానికి రంగం సిద్ధమయిందని.. ఇదిగో ప్రారంభమవుతోందని నాలుగు నెలలకిందట ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. దీనిపై విశాఖలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇన్ఫోసిస్ ను కూడా తరిమేశారా అని ఎక్కువ మంది అనుమానపడుతున్నారు. తెర వెనుక ఏం జరిగిందా అని ఆరా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి క్యాంపస్ లు ఏమైనా పెట్టాలనుకుంటే… వైసీపీ నేతలు కమిషన్ల పేరుతో విరుచుకుపడతారు. వారి ఆఫీసుల్లో ఏమైనా కాంట్రాకులు ఉంటే మాకే ఇవ్వాలంటారు. తమ వారికి ఉద్యోగాలు కల్పించాలంటారు. ఇలాంటి డిమాండ్లు ఏమైనా పెట్టడంతో ఇన్ఫోసిస్ ఆగిపోయిందా అన్న అనుమానాలు ప్రారంభమవుతున్నాయి.
నిజానికి ఇన్ఫోసిస్ క్యాంపస్ ప్రభుత్వం ఆహ్వానిస్తే రాలేదు . తమ దగ్గర పని చేస్తున్న ఉద్యోగులు.. కొత్తగా నియమించుకుటున్న ఉద్యోగుల్లో అత్యధిక మంది టైర్ -2 సిటీల నుంచి వస్తున్నారని.. అలాంటి సిటీల్లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని కంపెనీ చెబుతోంది. మొత్తం నాలుగు టైర్ – 2 సిటీల్ని ఎంపిక చేసుకోగా అందులో ఒకటి వైజాగ్. వైజాగ్‌లో వెయ్యి మంది ఉద్యోగుల సామర్థ్యంతో తొలి క్యాంపస్ పెట్టాలని అనుకున్నారు. ఇన్ఫోసిస్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా సొంతంగా ఆఫీసు.. ఇతర ఏర్పాట్లు చేసుకుంటోంది. కానీ మధ్యలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత పనులు నెమ్మదించాయి. ఇన్ఫోసిస్ నుంచి కూడా ఎలాంటి అప్ డేట్ బయటకు రావడం లేదు.
విశాఖ పట్నం నుంచి గత మూడున్నరేళ్లుగా చాలా ఐటీ కంపెనీలు వెళ్లిపోయాయి. రావాల్సిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మాత్రమే కాదు వచ్చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్ఎస్బీసీ లాంటి కంపెనీలు కూడా వెళ్లిపోయాయి. ఇప్పుడు సొంతంగా వద్దామనుకున్న ఇన్ఫోసిస్‌ను ప్రభుత్వాన్ని సంప్రదించంకుండా వచ్చేస్తారా అని ఈగోకు పోయి.. అడ్డంకులు సృష్టించారేమో అన్న సందేహం ప్రారంభమయింది. వైజాగ్ క్యాంపస్ విషయంలో ఇన్ఫోసిస్ వెనుకడుగు వేస్తే… విశాఖకు జగన్ ప్రభుత్వం మరో ద్రోహం చేసినట్లే.