తెలంగాణ రాష్ట్ర సమితి పేరు నుంచి తెలంగాణ తీసేసిన తర్వాత కేసీఆర్ పై … తెలంగాణ ప్రయోజనాల పేరుతో ఇతర పార్టీలు విమర్శలు చేయడం ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా కొత్త ఇంచార్జ్ డీజీపీని కేసీఆర్ నియమించారు. ఆయనతో పాటు మరో ఐదు స్థానాల్లో ఐపీఎస్‌లను బదిలీ చేశారు. ఈ ఐదు అత్యంత పవర్ ఫుల్ పోస్టులు. పోలీస్ శాఖ మొత్తం ఆ ఐదు పోస్టుల మీదుగానే నడుస్తుంది. అయితే ఈ ఆరు పోస్టుల్లో అందరూ తెలంగాణ క్యాడరే అయినప్పటికీ.. తెలంగాణ స్థానికులు కాదు. ఇతర రాష్ట్రాల వారు. టీ పీసీసీ నేత రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని తెరపైకి తెచ్చారు.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాధించుకున్న తెలంగాణలో ఉన్న స్థాయి పోస్టుల్లో తెలంగాణ వారు ఉండటం లేదని ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎస్‌లలో ఉన్న తెలంగాణ వారు సమర్థులు లేరా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి ఐపీఎస్ , ఐఏఎస్ ఆఫీసర్లలో తెలంగాణ వారికి కేసీఆర్ మొదటి నుంచి ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. బీహార్ వాళ్లకు చాన్సిస్తున్నారని ఆరోపిస్తూ ఉంటారు. ఇప్పుడు డీజీపీ అయిన అంజనీకుమార్ కూడా బీహార్ వాసినే. తెలంగాణ క్యాడర్ మాత్రమే కాకుండా.. తెలంగాణ స్థానికత ఉన్న సివిల్ సర్వీస్ అధికారుల్లో చాలా మందికి తమకు ప్రాధాన్య పోస్టులు లభించడం లేదన్న అసంతృప్తి చాలా కాలంగా ఉంది.
ఆ మధ్య ఐఏఎస్ అధికారులు గ్రూప్ గా ఏర్పడి ఈ అంశంపై చర్చలు కూడా జరిపారన్న విషయం గుప్పుమంది. అయితే ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఆగిపోయారని అంటున్నారు. కానీ ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి హైలెట్ చేస్తూనే ఉంటారు. పోస్టింగ్ ల విషయంలో ప్రభుత్వం వద్ద ఎంత లాబియీంగ్ చేసుకుంటే.. అంత ప్రాధన్య పోస్టు లభించే రాజకీయ పరిస్థితులు వచ్చేశాయి. అయితే కేసీఆర్ తెలంగాణ స్థానికత ఉన్న అధికారుల్ని పెద్దగా నమ్మకపోవడం ఏమిటన్నది ఇప్పుడు రేవంత్ .. ప్రజందరి ముందు పెడుతున్న ప్రశ్న.